కదిరి: ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతులను రసాయనిక ఎరువులు సంకటంలో పడేశాయి. ధరలు అమాంతం పెరగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో పాటు అంతర్జాతీయ ముడి చమురు ధరల పేరుతో ఎరువుల కంపెనీలు బస్తాకు రూ.250 నుంచి రూ.400 వరకూ ధర పెంచేశాయి. 50 కేజీల కాంప్లెక్స్ ఎరువుల బస్తా మొన్నటి దాకా రూ.2 వేలు ఉంటే ఇప్పుడు రూ.2,350పైగా అమ్ముతున్నారు. సాధారణంగా ఎకరాకు రెండు బస్తాల ఎరువులు వాడతారు. ఈ లెక్కన ఎకరాకు రూ.600 నుంచి రూ.700 వరకూ అదనపు భారం పడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది రెండుసార్లు ఎరువుల ధరలు పెంచగా, ఈసారి ఖరీఫ్ ప్రారంభంలోనేఽ భారీగా పెంచింది. రానున్న రోజుల్లో మళ్లీ ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఫర్టిలైజర్ షాపుల యజమానులు చెబుతున్నారు.
రైతులపై రూ.30 కోట్ల అదనపు భారం..
జిల్లా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 2,69,167 హెక్టార్లు. జిల్లాలో ఒక్కో మండలంలో సరాసరిన ఏడాదికి 3,500 టన్నుల రసాయనిక ఎరువులు వినియోగిస్తారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. టన్నుపై కనిష్టంగా రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.3 వేలు వరకూ ఎరువుల ధరలు పెరగడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఎక్కువగా వాడే 20.20.0.13 రకం ఎరువుల బస్తా ధర భారీగా పెరిగింది. ఇందులో 13 శాతం గంధకం ఉంటుంది. గత ఏడాదితో పోలిస్తే దీని ధర సుమారు 15 శాతం పెరిగింది. పెంచిన ఎరువుల ధరల కారణంగా జిల్లా రైతులపై ఈ ఖరీఫ్ సీజన్‌లోనే రూ.30 కోట్ల దాకా అదనపు భారం పడే అవకాశం ఉందని అధికారులే చెబుతున్నారు.
అప్పుడూ ఇంతే..
రాష్ట్ర విభజన తర్వాత 2014–19 మధ్య కాలంలో కూడా ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ ఐదేళ్లలో నాలుగు సార్లు ఎరువుల ధరలు పెంచింది. ఇప్పుడు మళ్లీ అదే బాటలో నడుస్తోంది. ఈ రెండేళ్లలోనే మూడు సార్లు పెంచింది. కానీ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లూ ఏనాడూ ఎరువుల ధరలు పెంచకపోగా విత్తనాలు, ఎరువులు రైతు భరోసా కేంద్రాల వద్దే అందుబాటులో ఉంచారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఎరువుల కోసం పట్టణాలకు వెళ్లక తప్పలేదు. పశ్చిమాసియా యుద్ధాన్ని బూచిగా చూపి ఎరువుల ధరలు ఇలా అమాంతం పెంచేశారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ అనుమతితోనే ఎరువుల ధరలు పెంచినట్లు కంపెనీలు చెబుతున్నాయి.
ఖరీఫ్ సమీపించినా నేటికీ సబ్సిడీ విత్తనం ఊసెత్తని చంద్రబాబు ప్రభుత్వం రసాయనిక ఎరువుల ధరలు భారీగా పెంచేసి రైతుపై మోయలేని భారం మోపింది. రెండేళ్లుగా పంటలు చేతికందక ఆర్థికంగా చితికిపోయిన రైతులు ఎరువుల అదనపు ధరల బరువు మోయలేక కాడి కిందపడేసే పరిస్థితులు నెలకొన్నాయి.
బస్తాపై రూ.250 నుంచి
రూ.400 వరకు పెంపు
జిల్లా రైతులపై రూ.30 కోట్ల దాకా
అదనపు భారం
ఎరువుల భారంతో రైతన్నల ఆందోళన
చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కారు
సేంద్రియ ఎరువులే మేలు
రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలి. అలా చేస్తే దిగుబడులు పెరగడంతో పాటు పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయి. జిల్లాలో ఎక్కడైనా నిర్దేశించిన ధరలకన్నా అధిక ధరలకు ఎరువులు అమ్మితే ఆ దుకాణాన్ని సీజ్ చేస్తాం. ఎరువులకు కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు తప్పవు. – నారాయణ నాయక్,
జిల్లా వ్యవసాయాధికారి


