ఆర్టీసీకి డీజిల్‌ సెగ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి డీజిల్‌ సెగ

May 24 2026 1:15 AM | Updated on May 24 2026 1:15 AM

పుట్టపర్తి టౌన్‌: చమురు ధరల సెగ ఆర్టీసీకి తగులుతోంది. ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్న ప్రజా రవాణా వ్యవస్థపై డీజిల్‌ ధర పెంపు తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం జిల్లాలో లీటర్‌ డీజిల్‌ రూ.102.15కు చేరుకోవడంతో జిల్లా పరిధిలో ఆర్టీసీకి నెలకు రూ.36 లక్షల మేర అదనపు భారం పడుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు ఇప్పుడప్పుడే వీడే అవకాశం లేకపోవడంతో క్రూడ్‌ ఆయిల్‌ ధర రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఆయిల్‌ కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. ఈక్రమంలోనే ఈనెల 20వ తేదీ వరకూ లీటర్‌ డీజిల్‌ రూ.98.07 ఉండగా...ఈ నెల 21వ తేదీన కేంద్రం డీజిల్‌ పై రూ.3.12 పెంచడంతో లీటర్‌ రూ.101.19కి చేరింది. తాజాగా శనివారం డీజిల్‌పై 96పైసలు పెరగ్గా... ప్రస్తుతం లీటర్‌ డీజిల్‌ రూ.102.15కి చేరింది. రానున్న రోజుల్లో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో ఆర్టీసీకి గడ్డుకాలమేనని సంస్థ అధికారులే చెబుతున్నారు. ఉచిత బస్సు ప్రభావంతో ఇప్పటికే పలు సర్వీసులు రద్దు చేసిన ఆర్టీసీ..రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులకు బ్రేక్‌ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రజారవాణాపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.

రోజూ 30 వేల లీటర్ల వినియోగం..

జిలాల్లో ధర్మవరం, హిందూపురం, మడకశిర, పెనుకొండ, కదిరి, పుట్టపర్తిలలో ఆర్టీసీ డిపోలున్నాయి. ఈ ఆరు డిపోల్లోని 380 బస్సులున్నాయి. రోజూ 1.40 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రోజూ సగటున 1.45 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా..30,000 లీటర్లు డీజిల్‌ వినియోగిస్తున్నారు. ఆర్టీసీ బస్సుకు సగటున 6 కిలోమీటర్లలోపు మైలేజీ వస్తుంది. కొన్ని బస్సులు లీటర్‌కు 5 కిలోమీటర్లు మాత్రమే మైలేజీ ఇస్తున్నాయి. ఈలెక్కన నెలకు ఎంతలేదన్నా రూ.36 లక్షల మేర ఆర్టీసీపై అదనపు భారం పడనుంది.

జనం బెంబేలు..

ఆర్టీసీపై డీజిల్‌ రూపంలో అదనపు భారం పడుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ల ధర పెంచేందుకు సిద్ధమవుతారని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. చాలా గ్రామాలకు ఇప్పటికీ పల్లెవెలుగు బస్సులు మాత్రమే వెళ్తుండగా..చార్జీలు పెంచితే సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది.

వరుసగా రెండుసార్లు

డీజిల్‌ ధర పెంచిన కేంద్రం

నాలుగు రోజుల్లోనే లీటర్‌పై రూ.4.08 పెరిగిన వైనం

జిల్లాలో ఆర్టీసీపై రోజూ

రూ.1.20 లక్షల అదనపు భారం

సర్వీసులను రోజురోజుకూ

కుదిస్తున్న అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement