రాత్రివేళల్లో నిఘా మరింత పెంచండి | - | Sakshi
Sakshi News home page

రాత్రివేళల్లో నిఘా మరింత పెంచండి

May 24 2026 1:15 AM | Updated on May 24 2026 1:15 AM

కదిరి టౌన్‌/నల్లచెరువు : ‘‘పోలీసులు రక్షణగా ఉన్నారన్న నమ్మకంతో రాత్రి వేళ ప్రజలంతా నిద్రపోతారు. వారి నమ్మకాన్ని మనం వమ్ముచేయకూడదు. రాత్రివేళ నిఘా మరింత పెంచాలి. చోరీలు, అసాంఘిక కార్యక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలి. అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు సేకరించండి.’’ అని ఎస్పీ సతీష్‌కుమార్‌ పోలీసులను ఆదేశించారు. శుక్రవారం అర్ధరాత్రి వేళ ఆయన కదిరి అర్బన్‌ పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేశారు. అనంతరం కదిరి పట్టణంలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ పోలీసుల నైట్‌ బీట్‌ విధులను స్వయంగా పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా నల్లచెరువు స్టేషన్‌కు వెళ్లి నైట్‌ బీట్‌ విధుల్లో ఉన్న పోలీసుల పనితీరు, స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు.

నైట్‌ బీట్‌ పరిశీలన..

తొలుత కదిరి అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ను తనికీ చేసిన ఎస్పీ సతీష్‌కుమార్‌ అనంతరం వలీసాబ్‌ రోడ్డు, నిజాంవలీ కాలనీ, కుటాగుళ్ల తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసుల నైట్‌బీట్‌ విధులను స్వయంగా పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీస్‌ సిబ్బందితో నేరుగా మాట్లాడిన ఎస్పీ... ప్రజల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, రాత్రి సమయంలో మహిళలు, వృద్ధులు ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంతో రాత్రి వేళ కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఎలా కొనసాగుతోందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానం, రాత్రి గస్తీ నిర్వహణ, అనుమానితుల కదలికలపై సమాచారం సేకరణ వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు వివరాలను నమోదు చేయడంతో పాటు అవసరమైతే వేలిముద్రలు సేకరించాలని ఎస్పీ సూచించారు. అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, చోరీలు, ఇతర అసాంఘిక చర్యలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలన్నారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. అనంతరం ఆయన నల్లచెరువు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్‌స్టేషన్‌లోని పలు కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రాత్రి సమయంలో పోలీసులు నిర్వహిస్తున్న గస్తీని పరిశీలించారు. ఎస్పీ వెంట కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి, పట్టణ సీఐ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.

అనుమానాస్పద వ్యక్తుల

వేలిముద్రలు సేకరించండి

పోలీసులకు ఎస్పీ

సతీష్‌కుమార్‌ ఆదేశం

శుక్రవారం అర్ధరాత్రి కదిరి,

నల్లచెరువు స్టేషన్ల తనిఖీ

Advertisement
 
Advertisement
Advertisement