పర్యావరణంపై గొడ్డలి వేటు | - | Sakshi
Sakshi News home page

పర్యావరణంపై గొడ్డలి వేటు

May 24 2026 1:15 AM | Updated on May 24 2026 1:15 AM

మరువకొత్తపల్లిలో

22 ఏళ్ల చింతచెట్ల నరికివేత

చిలమత్తూరు: సైబీరియన్‌ పక్షుల విడిది కేంద్రానికి కూతవేటు దూరంలోని మరవకొత్తపల్లి సమీపంలో 22 ఏళ్లనాటి చింత చెట్లను కొందరు ఇష్టారీతిన తొలగిస్తున్నారు. పూతదశలో ఉన్న భారీ వృక్షాలను తొలగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా చేయకుండా ఓ ప్రైవేటు భూమిలో ఉన్న చింత చెట్లు తొలగించేందుకు అధికారులు అనుమతి ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో ఆగినా...

సైబీరియన్‌ పక్షుల విడిది కేంద్రానికి సమీపంలో సుమారు 300 చెట్లు తొలగించేందుకు కొందరు గతంలోనే పూనుకున్నారు. పలువురు గ్రామస్తులు, పర్యావరణవేత్తలు అడ్డుకోవడంతో అప్పుడు చెట్ల తొలగింపు తాత్కాలికంగా ఆగింది. కానీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అధికార పార్టీ నేతల అండతో భారీ వృక్షాలను ఇష్టానుసారం తొలగిస్తున్నారు. రోడ్డు పక్కనే ఉన్న భారీ వృక్షాలను తొలగించడం ముమ్మాటికీ వాల్టా చట్టాన్ని ఉల్లంఘించడమేనని పర్యావరణవేత్త భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. అటవీశాఖ అధికారులు ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారని, ఏమాత్రం పరిశీలన చేయకుండా చెట్లు తొలగింపునకు ఎలా అనుమతులు మంజూరు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, లేనిపక్షంలో వృక్షాలు తొలగించకుండా అడ్డుకుంటానని హెచ్చరించారు.

ప్రశాంతంగా ఇంటర్‌

సప్లిమెంటరీ పరీక్షలు

పుట్టపర్తి: జిల్లాలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. శనివారం 32 కేంద్రాల్లో జనరల్‌ విద్యార్థులకు హిస్టరీ, బోటనీ, ఒకేషనల్‌ విద్యార్థులకు పేపర్‌–1 పరీక్ష నిర్వహించారు. ఉదయం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలకు 370 మంది విద్యార్థులకు గాను 337 మంది హాజరు కాగా, 33 మంది గైర్హాజరైనట్లు ఇంటర్‌విద్య జిల్లా అధికారి (డీఐఈఓ) చెన్నకేశవప్రసాద్‌ తెలిపారు. ఇక మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 395 మందికి గాను 374 మంది విద్యార్థులు హాజరు కాగా, 21 మంది గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో మొత్తంగా 54 మంది గైర్హాజరైనట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement