సాక్షి పుట్టపర్తి: సాక్షి దినపత్రికపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తన అక్కసు వెళ్లగక్కారు. పెనుకొండ పట్టణంలో శనివారం నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి.. ‘చెత్తను క్లీన్ చేస్తున్నాం, ఈ చెత్త పేపర్‌ను కూడా చెత్తలోనే వేస్తున్నాం, అబద్దాల పేపర్’ అంటూ చెత్తకుప్పలోకి విసిరారు. ఇటీవల సాక్షి దినపత్రికలో ప్రభుత్వ వైఫల్యాలు, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, దందాలు, భూకబ్జాలు, అక్రమాలపై వరుస కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ క్రమంలోనే తనకు వ్యతిరేకంగా కథనాలు రావడాన్ని మంత్రి సవిత జీర్ణించుకోలేకపోయారు.
రొళ్ల సమీపంలో దారిదోపిడీ
రొళ్ల: పట్టపగలే ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని అడ్డుకుని బంగారు ఉంగరాన్ని అపహరించిన ఘటన రొళ్లలో సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన మేరకు.. రొళ్ల మండలం టీడీపల్లికి చెందిన తిమ్మారెడ్డి శనివారం ఉదయం వ్యక్తిగత పనిపై రొళ్లకు వచ్చాడు. పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా హనుమంతనపల్లి పొలిమేరలో బైలాంజనేయస్వామి ఆలయం వద్ద ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. ఒకరు వెనుక నుంచి తిమ్మారెడ్డిని గట్టిగా పట్టుకోగా మరో దుండగుడు రూ.1.50 లక్షల విలువైన బంగారు ఉంగరాన్ని లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. ఆ సమయంలో బాధితుడు కేకలు వేసినా ఫలితం లేకపోయింది. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
కారు బోల్తా.. ఐదుగురికి గాయాలు
చిలమత్తూరు: మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై పెద్దనపల్లి క్రాస్ సమీపంలో శనివారం కారు బోల్తాపడిన ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. హైదరాబాదు నుంచి బెంగళూరు వైపుగా వెళుతున్న కారు బోల్తా పడింది. కారు నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే 108 ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్సాహంగా జాతీయ స్థాయి రాతి దూలం పోటీలు
పెద్దవడుగూరు: మండలంలోని ఆవులాంపల్లిలో జాతీయ స్థాయి వృషభాల బల ప్రదర్శన మూడో రోజు సీనియర్ విభాగం పోటీలు హోరాహోరీగా సాగాయి. 11 జతల వృషభాలు పోటీలో పాల్గొనగా తెలంగాణలోని హుజునగర్‌కు చెందిన రైతు సుంకి సురేంద్రరెడ్డి ఎస్‌ఎస్‌ఆర్ బుల్స్ ప్రథమ స్థానంలో నిలిచాయి. ద్వితీయ స్థానంలో బాపట్ల జిల్లా వేటపాలెం ఆర్‌కే బుల్స్, తృతీయ స్థానంలో హైదరాబాద్‌లోని ప్రగతి రీస్టార్ట్ బుల్స్, నాల్గో స్థానంలో అనంతపురం జిల్లా చౌటపల్లి రైతు ఓబుళరెడ్డి, అక్కంపల్లి ఇంద్రారెడ్డి వృషభాలు, ఐదో స్థానంలో బాపట్ల జిల్లా వేటపాలెం ఆర్‌కే బుల్స్, ఆరో స్థానంలో అనంతపురం జిల్లా రేగడికొత్తూరు ఆలగనురు గౌతమిరెడ్డి వృషభాలు, ఏడో స్థానంలో వైఎస్సార్ కడప జిల్లా కల్లూరు పెరుమాళ్ల శివకృష్ణయాదవ్ వృషభాలు, ఎనిమిదో సాఓ్థనంలో పెద్దవడుగూరు మండలం మేడిమాకులపల్లి రైతు తోట తిరుపాల్‌రెడ్డి వృషభాలు, కామాలాపురం ఆదిల్‌కు చెందిన వృషభాలు, తొమ్మిదో స్థానంలో వైఎస్సార్ జిల్లా కల్లూరు శివకృష్ణయాదవ్ వృషబాలు నిలిచాయి. విజేతలకు ఎస్‌ఐ ఆంజనేయులు, నిర్వాహకులు బహుమతులను ప్రదానం చేశారు.


