బాధితుడికి పరామర్శ | - | Sakshi
Sakshi News home page

బాధితుడికి పరామర్శ

May 24 2026 1:15 AM | Updated on May 24 2026 1:15 AM

బత్తలపల్లి: పేదరికం కారణంగా సరైన వైద్య చికిత్సలు పొందలేకపోతున్న రాజాకు అండగా బత్తలపల్లి పీహెచ్‌సీ వైద్యులు నిలిచారు. రాజా దుస్థితిపై ‘పేదకుటుంబానికి పెద్ద కష్టం’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై పీహెచ్‌సీ వైద్యాధికారి అరుణ్‌కుమార్‌ స్పందించారు. ఎంపీహెచ్‌ఏ డేవిడ్‌, ఎంఎల్‌హెచ్‌పీ, ఆశా వర్కర్లతో కలిసి శనివారం బత్తలపల్లిలోని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజా ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, వైద్య సేవలు అందించారు. రాజా కోలుకునేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని భరోసానిచ్చారు. దాతలు సైతం ఎవరైనా ముందుకు వచ్చి ఆ పేద కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.

ప్రథమ చికిత్స కేంద్రం సీజ్‌

హిందూపురం టౌన్‌: స్థానిక రహమత్‌పురలో అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని వైద్యశాఖ అధికారులు శనివారం సీజ్‌ చేశారు. కేంద్రంలో ఇంజక్షన్లు, వైద్య వినియోగ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రహమత్‌పుర నివాసి విజయలక్ష్మి నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు పలువురు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారణకు జిల్లా వైద్యాధికారి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైద్యాధికారి నవీన్‌కుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ మహేష్‌, పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. ప్రథమ చికిత్స కేంద్రం పరిమితులను దాటి వైద్య సేవలు అందిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో కేంద్రాన్ని సీజ్‌ చేశారు.

గంజాయి విక్రేత అరెస్ట్‌

గోరంట్ల: మండలంలోని కొండాపురం క్రాస్‌ వద్ద గంజాయి విక్రయిస్తున్న కదిరికి చెందిన షేక్‌ ఖాజావలిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ శేఖర్‌ తెలిపారు. వివరాలను శనివారం ఆయన వెల్లడించారు. అందిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన సమయంలో షేక్‌ ఖాజావలి పట్టుబడ్డాడని, అతని వద్ద నుంచి 1,010 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement