–: సందర్భం :– రేపు కల్లూరు సుబ్బారావు జయంతి
అనంతపురం కల్చరల్: కళ, సాహిత్య రంగాల్లో విశిష్ట వ్యక్తులకందించే ‘పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు స్మారక పురస్కారాలు –26’ కు గాను జిల్లాకు చెందిన సీనియర్ నటులు సంగాల నారాయణస్వామి, ఆదినారాయణరెడ్డి, ప్రసిద్ధ సాహితీవేత్త, బహు గ్రంథకర్త డాక్టర్ పతికి రమేష్‌నారాయణను ఎంపిక చేశారు. ఈ మేరకు లలితకళాపరిషత్తు ప్రధాన కార్యదర్శి గాజుల పద్మజ శనివారం వెల్లడించారు. ఎనిమిది పదుల వయసులోనూ యువతరానికి స్ఫూర్తినిచ్చేలా జీవితాలను గడుపుతున్న ఈ ముగ్గురిని పురస్కారాలకు ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. కాగా, తెలుగు, కన్నడ భాషా పండితుడిగా, త్యాగానికి ప్రతిరూపంగా నిలిచిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కల్లూరు సుబ్బరావు స్ఫూర్తిదాయక జీవితానికి మరింత ప్రాచూర్యం కల్పించడంలో భాగంగా అనంతపురంలోని లలితకళాపరిషత్తు ఆధ్వర్యంలో ఏటా ఆయన జయంతి నాడు పురస్కారాలను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన జయంతిని పురస్కరించుకుని లలిత కళాపరిషత్‌లో అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
16వ ఏటనే జాతీయోధ్యమంలో..
ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని కల్లూరు గ్రామంలో 1897 మే 25న జన్మించిన కల్లూరు సుబ్బారావు తన 16వ ఏట 1913లో దివ్యజ్ఞాన సమాజం వ్యవస్థాపకులు అనిబిసెంట్ ప్రసంగాలతో ప్రభావితమై జాతీయోధ్యమంలో చేరి జైలుకు వెళ్లారు. 1921 సెప్టెంబర్ 28న శిక్షా కాలం పూర్తయిన వెంటనే బళ్లారి సభలో గాంధీజీతో కలసి మళ్లీ ఉద్యమంలో పాల్గొన్నారు. 1928 నవంబర్‌లో నంద్యాలలో జరిగిన సభలో దత్తమండలాలకు రాయలసీమగా పేరు పెట్టిన వారిలో కల్లూరు సుబ్బారావు ప్రముఖులు. నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్ వంటి అనంత ఆణిముత్యాలు కల్లూరి సుబ్బారావు శిష్యులు కావడం విశేషం. జిల్లా కేంద్రంలోని లలిత కళాపరిషత్తుకు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఆయన సొంత స్థలాలను విరాళంగా ఇచ్చేసి త్యాగానికి ప్రతిరూపంగా మారారు. జిల్లాల్లోని అభ్యుదయ కార్యక్రమాలకు నాంది పలికిన అనంత త్యాగధనుడు కల్లూరు సుబ్బారావు 1973 డిసెంబర్ 20న శాశ్వతంగా కన్నుమూసినా ఆయన విగ్రహాన్ని ఎల్కేపీ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకుని కళాకారులు నిత్య నీరాజనాలర్పిస్తూనే ఉన్నారు.


