హిందూపురం టౌన్: ఎలాంటి అర్హతలు లేకున్నా హిందూపురంలో వైద్య సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అర్హత లేని వైద్యులపై చర్యలు తీసుకోవాలని హిందూపురం ప్రైవేట్ ఆస్పత్రుల, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వెంకటరమణ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో ధన్య గ్లోరీ హాస్పిటల్ పేరుతో అర్హత లేని వ్యక్తులు ఆస్పత్రి నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశామన్నారు. నకిలీ వైద్యుల వ్యవహారాన్ని బయటపెట్టినందుకు తనపై కొందరు వ్యక్తులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయిస్తామని, అవసరమైతే హత్య చేసేందుకు కూడా వెనుకాడబోమంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎలాంటి అర్హతలు లేకుండా వైద్యురాలిగా చలామణి అవుతూ గత ఎనిమిదేళ్లుగా ఆస్పత్రి నిర్వహిస్తున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం జిల్లా వైద్యాధికారులు స్పందించి ఆస్పత్రిలో తనిఖీ చేపట్టి నకిలీ వ్యవహారం నిజమని తేల్చి సీజ్ చేశారని గుర్తు చేశారు. అయితే సీజ్ చేసిన కొన్ని రోజుల్లోనే మళ్లీ అనుమతులు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందన్నారు. నకిలీ వైద్యులను ప్రోత్సహిస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్యశాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టి అర్హత లేని ఆసుపత్రులను వెంటనే మూసివేయాలని, లేకపోతే వైద్యులందరూ కలిసి న్యాయపోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. సమావేశంలో ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ జక్కా నరేంద్ర, డాక్టర్ అశ్వత్థరెడ్డి, డాక్టర్ రోహిల్‌కుమార్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.


