అనంతపురం ఎడ్యుకేషన్: సమర్థవంతమైన పర్యవేక్షణ నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే విద్యారంగ పథకాలను సమర్థవంతంగా అమలు చేయగలుగుతామని డీవైఈఓలు, ఎంఈఓ–2లకు శ్రీసత్యసాయి జిల్లా విద్యాధికారి కృష్ణప్ప సూచించారు. పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ (ీపీఏఎల్), టీచ్ టూల్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ అంశాలపై జోన్–6 పరిధిలోని అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని డీవైఈఓలు, ఎంఈఓల–2లకు శనివారం అనంతపురంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణప్ప మాట్లాడుతూ.. ఈ శిక్షణ ఉపవిద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులకు ఎంతో ఉపయుక్తం కానుందన్నారు. ‘పీఏఎల్’ స్టేట్ నోడల్ ఆఫీసర్ కిషోర్ బాబు మాట్లాడుతూ... ట్యాబ్‌ల ద్వారా విద్యార్థులు స్వయంగా అభ్యసన కొనసాగించే ‘పీఏఎల్’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. టీచ్ టూల్ స్టేట్ రిసోర్స్ పర్సన్ నాగేంద్ర మాట్లాడుతూ.. డాష్‌బోర్డ్, మానిటరింగ్ విధానాలను వివరించారు. టీసీఎస్ రిసోర్స్ పర్సన్ విజయ్ మాట్లాడుతూ.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు, పర్యవేక్షణ విధానాలను వివరించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలను సమన్వయం చేసుకుంటూ సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. శిక్షణలో ఏఎంఓలు వేణుగోపాల్, చంద్రశేఖర్, అసిస్టెంట్ ఏఎంఓ ఫణి రాజు పాల్గొన్నారు.
డీవైఈఓలు, ఎంఈఓ–2లకు శిక్షణ కార్యక్రమంలో శ్రీసత్యసాయి జిల్లా విద్యాధికారి కృష్ణప్ప


