బత్తలపల్లి: ‘అమ్మ ఊరికెళ్లింది... ఇప్పుడొస్తుంది. మనకు బొమ్మలు తెచ్చిస్తానంది’ అంటూ అన్న చెల్లెలు ముచ్చటించుకోవడం చూసిన స్థానికులకు కన్నీరు ఆగలేదు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి చోటు చేసుకున్న ప్రమాదంలో కన్నతల్లి మృతి చెందిందనే విషయం తెలియని చిన్నారులను చూసిన వారి ఆవేదనకు అంతు లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే... తాడిమర్రి మండలం నార్శింపల్లి గ్రామానికి చెందిన భూమే దివ్యప్రసాద్, భూమే శివమ్మ(32) దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. గురువారం బత్తలపల్లి మండలం దంపెట్ల గ్రామంలో ఓ శుభకార్యానికి దివ్యప్రసాద్, శివమ్మ ద్విచక్రవాహనంలో వెళుతుండగా రామాపురం సమీపంలో రోడ్డుపై అడ్డుగా వచ్చిన కుక్కలను తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పి ఇద్దరూ కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. అక్కడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున శివమ్మ మృతి చెందింది. ఈ విషయం తెలియని చిన్నారులు.. మరికాసేపట్లో అమ్మ వస్తుందని, ఆడుకునేందుకు బొమ్మలు తెచ్చిస్తుందంటూ మాట్లాడుకోవడం గమనించిన స్థానికుల హృదయాలు బరువెక్కిపోయాయి. కాసేపటి తర్వాత తల్లి మృతదేహం ఇంటి వద్దకు చేరుకోవడంతో చిన్నారులను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
శివమ్మ(ఫైల్), తల్లి మృతి విషయం తెలియక ముందు చిన్నారులు
తల్లి మృతి విషయం తెలియని చిన్నారులు


