తనకల్లు: ఉపాధి హామీ పనులను పారదర్శకంగా చేపట్టాలని డ్వామా పీడీ విజయేంద్రప్రసాద్ అన్నారు. స్థానిక మండల పరిఽషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బందితో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ సిబ్బంది గ్రామాల్లో పనులపై అవగాహన కల్పించాలన్నారు. మండలంలో దాదాపు రోజూ 2,500 పైగా కూలీలు పనులకు హాజరుకావాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే కేవలం 1500 మంది కూలీలు మాత్రమే పనులకు హాజరవుతుండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు సమన్వయం చేసుకొని పనులకు హాజరయ్యే కూలీల సంఖ్యను పెంచాలన్నారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ టార్గెట్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామానాయక్, ఏపీఓ మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.
14 తులాల బంగారు చోరీ
ధర్మవరం రూరల్: మండల పరిధిలోని కుణుతూరు సమీపంలో ఉన్న ఇందిరమ్మ కాలనీకి ఎదురుగా నివాసం ఉన్న లక్ష్మినారాయణరెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. రూరల్ పోలీసులకు బాధితుడి ఫిర్యాదు మేరకు.. లక్ష్మినారాయణరెడ్డి కుటుంబ సభ్యులంతా కలిసి గురువారం పుట్టపర్తికి వెళ్లారు. అయితే తిరిగి ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. ఇంట్లో ఉన్న సెల్ఫ్‌లో పెట్టుకున్న సుమారు 14 తులాల బంగారు నగలు చోరీ జరిగినట్లు గుర్తించామని బాధితుడు లక్ష్మినారాయణరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.
పాముకాటుతో
యువకుడి మృతి
పరిగి: మండల కేంద్రంలోని 90 ఇండ్ల ఎస్సీ కాలనీ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పవన్(18) పాముకాటుతో శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాలమేరకు.. మూడు రోజుల క్రితం పవన్ తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాముకాటు వేసిందన్నారు. హుటాహుటిన హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించామని చెప్పారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లామన్నారు. అతని ఆరోగ్య స్థితి మెరుగుపడకపోవడంతో శుక్రవారం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందాడని పేర్కొన్నారు. చేతికొచ్చిన కుమారుడు ఇలా అకాల మరణంతో పొందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
ప్రేమ పేరుతో బాలికలపై అత్యాచారం?!
● పోలీసుల అదుపులో నిందితులు
తాడిపత్రిటౌన్: సెల్‌ఫోన్, టీవీలను చూస్తూ ప్రేమకు ఆకర్షితులై అభం శుభం తెలియని బాలికలు కేటుగాళ్ల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. శుక్రవారం తాడిపత్రి పట్టణంలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలు చర్చనీయాంశమయ్యాయి. తాడిపత్రి పట్టణం సంజీవనగర్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థినిని అదే కాలనీకి చెందిన 10వ తరగతి చదివి మానేసిన బాలుడు ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతో పాటు బాలికతో దాదాపు నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు ఇప్పించుకొని మరో ముగ్గురు స్నేహితులతో కలిసి జల్సా చేశారు. అలాగే టైలర్స్ కాలనీకి చెందిన మరో 8వ తరగతి విద్యార్థినిని.. ఇంజనీరింగ్ చదివే విద్యార్థి ప్రేమ పేరుతో వంచించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక నుంచి దాదాపు 6 తులాలు బంగారు ఆభరణాలు ఇప్పించుకొని ఇంటికి ఏసీ, తల్లిదండ్రులకు విలువైన సెల్‌ఫోన్లను కొనిచ్చినట్లు తెలిసింది. అయితే ఇంట్లోని బంగారం మాయం కావడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు బాలికలను గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయట పడింది. విషయాన్ని బాలికల తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో నిందితులతో పాటు వారి స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని గుట్టుగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
గొర్రెల కాపరిపై
ఎలుగుబంటి దాడి
శెట్టూరు: మండలంలోని ఎర్రబోరేపల్లికి చెందిన గొల్ల నాగేంద్ర కుమారుడు శ్రీకాంత్ ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకోంది. గ్రామస్తుల వివరాలమేరకు.. గ్రామ సమీపంలోని నల్లకొండ ప్రాంతంలోకి శ్రీకాంత్ గొర్రెలను మేపు కోసం తీసుకెళ్లాడు. అదే సమయంలో పొదల చాటున దాగి ఉన్న ఎలుగుబంటి శ్రీకాంత్‌పై ఒక్కసారిగా దాడిచేసి గాయపర్చింది. చుట్టు పక్కల రైతులు గమనించి ఎలుగుబంటిని తరిమివేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్‌ను జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


