ప్రశ్నించే గొంతును నొక్కడమే | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నించే గొంతును నొక్కడమే

May 23 2026 1:52 AM | Updated on May 23 2026 1:52 AM

నారా లోకేష్‌ మౌఖిక ఆదేశాలతోనే గన్‌మెన్లను తొలగించారు

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, భూకబ్జాలు, అక్రమ వసూళ్లు, దౌర్జన్యాలపై ప్రశ్నిస్తున్నందుకే తనను టార్గెట్‌ చేసుకున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేష్‌కు తనపై తప్పుడు నివేదికలు ఇచ్చారన్నారు. అనంతపురం పరిసర ప్రాంతాల్లో తిరగనీయకుండా కట్టడి చేయాలనే కుట్ర జరిగిందని ఆరోపించారు. లోకేష్‌ మౌఖిక ఆదేశాలతోనే ఎస్పీ కార్యాలయం ఎలాంటి నోటీసూ లేకుండా తనకు గన్‌మెన్లను తొలగించిందని విమర్శించారు.

రాప్తాడు అరాచకాలపై గళమెత్తా

రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన హత్యలు, దళిత బాలికపై అత్యాచారం, భూవివాదాలు, ఇసుక దోపిడీ, టమాట మార్కెట్‌లో అక్రమ వసూళ్లు, రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, అక్రమ మద్యం వంటి అంశాలపై తాను గళమెత్తానని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. హంద్రీ–నీవా కాలువ లైనింగ్‌, పేరూరు డ్యాంలో నీరు లేక రైతుల బోర్లు ఎండిపోవడం వంటి అంశాల్లో కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపానన్నారు. రాప్తాడులో జరుగుతున్న అన్యాయాలపై కూడా స్పందించాలని లోకేష్‌ను కోరారు.

ప్రజలే నాకు రక్షణ

‘నా ప్రాణానికి ముప్పు ఉందని భావించి పదేళ్లుగా గన్‌మెన్లను కొనసాగించిన అధికారులు, ఇప్పుడు ఒక్కసారిగా తొలగించడం వెనుక కుట్ర ఉందనే అనుమానం కలుగుతోంది. గన్‌మెన్లు లేకపోయినా ప్రజలే నాకు రక్షణ’ అని ప్రకాష్‌రెడ్డి అన్నారు.

పాపంపేటలో ఒక్క ఇంటినీ నేలకూలనివ్వం

‘పాపంపేటలో ఇళ్లన్నీ కూల్చేస్తామని ఇటీవల ఎవడో ఒకడు అక్కడికి వచ్చి అన్నాడంట. వాడి తల నేలకూల్చుతాం తప్ప ఒక్క ఇంటినీ నేలకూలనివ్వం’ అని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు. 1991, 1997 మధ్యనే 106, 119 సర్వే నంబర్లలోని భూములను పూర్తిగా శోత్రియంధారులకు స్వాధీనం చేసిందన్నారు. కోర్టును తప్పుదోవ పట్టించి తెచ్చుకున్న ఆర్డర్‌తో ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించి ఆ భూములు స్వాధీనం చేసుకుని అప్పట్లోనే అమ్ముకున్నారన్నారు. 30 ఏళ్ల తర్వాత తాను వారసుడినని ఒకడు వచ్చాడన్నారు. గత ప్రభుత్వంలో కోర్టు నుంచి జడ్జిమెంట్‌ వస్తే... ప్రజల తరఫున వెళ్లి అప్పటి కలెక్టర్‌ నాగలక్ష్మిని కలిశానన్నారు. జడ్జిమెంట్‌ పట్టణానికి సంబంధించిన సర్వే నంబరుదని, సదరు వ్యక్తి అధికారికంగా వారసుడు కాదని, వారు పేర్కొన్న భూములన్నీ 1990–97 మధ్యే స్వాధీనం చేసినట్లు ఆధారాలతో కలెక్టర్‌ కోర్టుకు సమర్పించడంతో జడ్జి దీన్ని పక్కన పెట్టారన్నారు. ప్రభుత్వం మారాక హైకోర్టు పీపీని లోబరుచుకుని ప్రభుత్వాన్ని నమ్మించి, ఇక్కడ ఎమ్మెల్యే పరిటాల సునీత అండతో 14 ఇళ్లను కూల్చివేయించారని ఆరోపించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు జూటూరు చంద్రకుమార్‌, రాప్తాడు వైస్‌ ఎంపీపీ రామాంజనేయులు, వైఎస్సార్‌సీపీ నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, బండి వపన్‌, నీరుగంటి నారాయణరెడ్డి, పాపంపేట ప్రసాద్‌రెడ్డి, ఈశ్వరయ్య, ఎంపీటీసీలు వెంకటేశులు, సందీప్‌యాదవ్‌, పాపంపేట భూముల బాధితులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement