● శబ్ధానికి మృతి చెందిన యువకుడు
బత్తలపల్లి: పిడుగు పడిన శబ్ధానికి ఓ యువకుడి గుండె ఆగిన ఘటన మండలంలోని ఉప్పర్లపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, రెవెన్యూ అధికారుల వివరాలమేరకు.. ఉప్పర్లపల్లికి చెందిన చాకలి గంగాధర్(40) కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాడు. ఆయనకు భార్య లక్ష్మీతో పాటు కుమార్తెలు హారిక (ఇంటర్ ద్వితీయ సంవత్సరం), శమిత (9వ తరగతి), కుమారుడు అభిలేష్ (4వ తరగతి) చదువుతున్నారు. గురువారం రాత్రి పిల్లలతో కలిసి లక్ష్మీ ఇంట్లో నిద్రిస్తుండగా.. ఉక్కపోత కారణంగా గంగాధర్ ఆరుబయట నిద్రపోతున్నట్లు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పిడుగులు పడడంతో ఆ శబ్ధానికి గంగాధర్ గుండె ఆగి చనిపోయాడన్నారు. వర్షం పడుతోందని కుటుంబ సభ్యులు గంగాధర్‌ను లేపేందుకు ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. అపస్మారకస్థితిలో ఉన్నట్లు గుర్తించి 108కు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని పరీక్షించారు. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న వైస్ ఎంపీపీ గజ్జెల వెంగళరెడ్డి, తంబాపురం మాజీ సర్పంచు సానే జయచంద్రారెడ్డి గ్రామానికి చేరుకుని గంగాధర్ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. గంగాధర్ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
విద్యుదాఘాతంతో
రెండు పాడి ఆవుల మృతి
తలుపుల: మండలంలోని దేవరపల్లిలో గురువారం రాత్రి కురిసిన గాలి వానకు 11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపడటంతో విద్యుదాఘాతంతో రెండు పాడి ఆవులు మృతి చెందాయి. మల్లినాయుడు ఇంటి వద్ద వైర్లు కింద పడగానే వర్షపు నీటికి తగలడంతో పక్కనే ఉన్న రెండు ఆవులకు విద్యుత్ షాక్ కొట్టి చనిపోయాయి. రెండు ఆవులు చనిపోవడంతో రూ.90 వేలు నష్టం వచ్చిందని బాధితుడు మల్లినాయుడు తెలిపారు. ప్రభుత్వం సాయం చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
సెల్‌ఫోన్ చూస్తూ
కానరాని లోకాలకు...
● నీటి సంపులో పడి యువకుడి మృతి
బ్రహ్మసముద్రం: నీటి సంప్‌లో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పిల్లలపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు... మండల పరిధిలోని పిల్లలపల్లికి చెందిన మాల మల్లన్న నూతనంగా ఇల్లు కట్టుకుంటున్నాడు. వారింట్లో టైల్స్, గ్రానైట్ బండలు వేసే పనికి అనంతపురం నుంచి యువకులు వచ్చారు. వారిలో అనంతపురంలోని చంద్రబాబునగర్‌కు చెందిన మహ్మద్ గౌస్ (25) కూడా ఉన్నాడు. గురువారం రాత్రి మహ్మద్ గౌస్ సెల్‌ఫోన్ చూసుకుంటూ ప్రమాదవశాత్తూ ఇంటిముందు ఉన్న నీటి సంపులో పడిపోయాడు. అతనికి ఈత రాకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రైలు కింద పడి వ్యక్తి మృతి
తాడిపత్రి రూరల్: మండలంలోని తాడిపత్రి–చల్లవారిపల్లి రైల్వేస్టేషన్ మధ్యలో శుక్రవారం గూడ్స్ కింద పడి వ్యక్తి (45) మృతి చెందాడని జీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ తెలిపారు. గూడ్స్ కో పైలెట్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వెళ్లి మృతి చెందిన వ్యక్తి ఆచూకీ కోసం తనిఖీ చేశామన్నారు. ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశామన్నారు.


