మడకశిర: మడకశిరలో శుక్రవారం దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దళితులు రోడెక్కారు. గుడిబండ మండలం మందలపల్లికి చెందిన దళిత యువకుడు విజయభాస్కర్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వివిధ దళిత సంఘాల నాయకులు, వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన దళితులు పట్టణంలో మహా ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. విజయభాస్కర్ మృతి మిస్టరీని వెంటనే ఛేదించాలని నినాదాలు చేశారు. రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ జేఏసీ చైర్మన్ సాకే హరి మాట్లాడుతూ విజయభాస్కర్ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముమ్మాటికీ విజయభాస్కర్‌ది హత్యేనన్నారు. పోలీసులు హంతుకులను అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. విజయభాస్కర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి మాట్లాడుతూ వెంటనే పోలీసులు కేసు మిస్టరీని తేల్చాలన్నారు. పోస్ట్‌మార్టం నివేదికను బయటపెట్టాలని కోరారు. అనంతరం దళిత సంఘాల నాయకులు ఆర్‌డీఓ కార్యాలయ ఏఓకు వినతి పత్రమిచ్చారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంఆర్ హనుమంతు, ఎస్సీ జన సంఘం అధ్యక్షుడు కుళ్లాయప్ప, బహుజన చైతన్య వేదిక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది శివరామక్రిష్ణ, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జేబీపీ నాయకుడు గట్ట రామాంజనేయులు, గుడిబండ జెడ్పీటీసీ భూతరాజు, మాజీ ఎంపీపీ ఎల్‌కే నరసింహప్ప, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, జిల్లా కార్యదర్శి రంగనాథ్, దళిత సంఘం నాయకులు నిజవల్లిబాబు, రొళ్ల శ్రీనివాస్, నారాయణప్ప, నరసింహ, లక్ష్మీనారాయణ, తిప్పయ్య, సురేష్, చంద్రశేఖర్, కాంతరాజు పాల్గొన్నారు.
విజయభాస్కర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్


