బంధువును పరామర్శించి వస్తూ పరలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

బంధువును పరామర్శించి వస్తూ పరలోకాలకు..

May 23 2026 1:52 AM | Updated on May 23 2026 1:52 AM

లారీ ఢీ కొనడంతో మహిళ మృతి

రాప్తాడు రూరల్‌: అనంతపురం రూరల్‌ మండలం సోములదొడ్డి సమీపంలో అక్కమ్మ ఆలయం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కళ్ల ముందే భార్యను కోల్పోయాడో భర్త. పోలీసుల వివరాలమేరకు... బుక్కరాయసముద్రం మండలం పొడరాళ్లకు చెందిన నాగవేణి (36), రామచంద్ర దంపతులు సాధారణ రైతు కుటుంబానికి చెందినవారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ ఇద్దరు కుమారులను చదివిస్తూ జీవనం సాగిస్తున్నారు. బంధువుకు తేలు కుట్టడంతో అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసి దంపతులు పరామర్శించేందుకు వెళ్లారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. అనంతపురం నగరం దాటిన తర్వాత అక్కమ్మ ఆలయం వద్ద జాతీయ రహదారిపైకి ఎక్కగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ.. బైకును బలంగా ఢీకొంది. వెనుక కూర్చున్న నాగవేణి రోడ్డుపై పడిపోయింది. అంతలోనే లారీ ఆమైపె నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. భార్య మృతదేహాన్ని చూసి రామచంద్ర కన్నీరుమున్నీరుగా విలపించాడు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్‌ వాహనం ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. రూరల్‌ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజన ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న లారీ డ్రైవర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ప్రమాదం ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement