ఇంటర్‌ సప్లిమెంటరీకి 243 మంది గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సప్లిమెంటరీకి 243 మంది గైర్హాజరు

May 23 2026 1:34 AM | Updated on May 23 2026 1:34 AM

పుట్టపర్తి అర్బన్‌: జిల్లాలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లాలోని 32 కేంద్రాల్లో శుక్రవారం జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులకు ఇంగ్లిష్‌ పరీక్ష నిర్వహించారు. ఉదయం జరిగిన పరీక్షకు మొదటి సంవత్సరం విద్యార్థులు 3,525 మందికి గాను 3,351 మంది హాజరు కాగా 171 మంది గైర్హాజరైనట్లు ఇంటర్‌విద్య జిల్లా అధికారి (డీఐఈఓ) చెన్నకేశవప్రసాద్‌ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,164 మందికిగాను 1,092 మంది హాజరు కాగా, 72 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ వెల్లడించారు. మొత్తంగా 243 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.

రీసర్వే తప్పులపై అర్జీల వెల్లువ

నల్లమాడ ‘పరిష్కార వేదిక’లో రైతుల గగ్గోలు

పుట్టపర్తి అర్బన్‌: భూ సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు చేపట్టిన రీసర్వే మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతోంది. రీసర్వే పూర్తయ్యాక రైతులకు ఇస్తున్న పట్టాదారు పాసుపుస్తకాల్లో వివరాలన్నీ తప్పులు తడకగా ఉంటున్నాయి. సర్వే నంబర్‌ తప్పుగా నమోదుకావడం, భూ విస్తీర్ణం లెక్కింపులో తేడా ఉండటం, హద్దులు మారిపోవడం తదితర సమస్యలతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈక్రమంలోనే శుక్రవారం ‘ఒక నెల –ఒక నియోజక వర్గం –నాలుగు పర్యటనలు’ కార్యక్రమంలో భాగంగా నల్లమాడలో కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించగా...రీ సర్వే తప్పులపై స్థానిక రైతులు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు అందాయి. దీంతో కలెక్టర్‌ స్థానిక తహసీల్దార్‌తో అప్పటికప్పుడే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించారు. మిగతా వాటినీ పరిష్కరిస్తామని అర్జీదారులకు తెలిపారు. మొత్తంగా 97 అర్జీలు అందగా... 34 సమస్యలను అక్కడే పరిష్కరించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇక పుట్టపర్తి మండలానికి చెందిన వారు 18 అర్జీలు, బుక్కపట్నం మండలానికి చెందిన వారు రెండు అర్జీలిచ్చారన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్‌, ఎమ్మెల్యే పల్లె సింధూర, డీఆర్‌ఓ కొడయ్య, ఆర్డీఓ సువర్ణ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ

రాష్ట్ర కమిటీల్లో చోటు

పుట్టపర్తి: వైఎస్సార్‌ సీపీ అనుబంధ రాష్ట్ర కమిటీల్లో జిల్లా వాసులకు స్థానాలు దక్కాయి. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని రాష్ట్ర కమిటీల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కదిరికి చెందిన భూక్యా కృష్ణానాయక్‌ను నియమించారు. అలాగే వైఎస్సార్‌ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పుట్టపర్తికి చెందిన పురుషోత్తంరెడ్డి, వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా మడకశిరకు చెందిన జయప్రకాష్‌, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కదిరికి చెందిన భూమిరెడ్డి నరసింహారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శులుగా పుట్టపర్తికి చెందిన సాయిగీత, మడకశిరకు చెందిన నేత్రావతి, పంచాయతీరాజ్‌ వింగ్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మడకశిరకు చెందిన ఈరన్న, బీసీ సెల్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మడకశిరకు చెందిన అనంతరాజు, కల్చరల్‌ వింగ్‌ రాష్ట్ర కార్యదర్శిగా మడకశిరకు చెందిన మహేంద్రప్ప, ఆర్‌టీఐ వింగ్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మడకశిరకు చెందిన సత్యనారాయణ యాదవ్‌లను నియమించారు.

జిల్లా కమిటీలో పలువురికి స్థానం

వైఎస్సార్‌ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పుట్టపర్తికి చెందిన నరసారెడ్డిని నియమించారు. అలాగే జిల్లా అధికార ప్రతినిధిగా హిందూపురానికి చెందిన అంజినరెడ్డిని, పార్టీ అనుబంధ కమిటీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడిగా పుట్టపర్తికి చెందిన నారాయణస్వామిని నియమించారు.

నియోజకవర్గం కమిటీల్లో పలువురి నియామకం

కదిరి నియోజకవర్గ వలంటీర్స్‌ విభాగం అధ్యక్షుడిగా యు.నారాయణస్వామి, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా కలవ రామాంజనేయులు, పుట్టపర్తి నియోజక వర్గ ఎంప్లాయీస్‌ అండ్‌ పెన్షనర్స్‌ విభాగం అధ్యక్షుడిగా పుట్టపర్తికి చెందిన ఉదయ్‌భాస్కర్‌రెడ్డిని నియమించారు. ఇక నల్లచెరువు మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా కదిరికి చెందిన ఈ.బాలకృష్ణానాయక్‌ను నియమించారు. అలాగే కదిరి మున్సిపల్‌ ప్రచార విభాగం అధ్యక్షుడిగా కదిరికి చెందిన కోలార్‌ హసీన్‌ షహజాదే, మడకశిర నగర పంచాయతీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా మడకశిరకు చెందిన అంజలిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement