●రానున్న నాలుగు రోజులూ వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: దాదాపు మూడు నెలల పాటు ఏకధాటిగా 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ‘అనంత’ను భగభగలాడించిన సూరీడు శాంతించాడు. గురువారం అర్థరాత్రి వరుణుడు కరుణించడంతో శుక్రవారం పగలంతా సూర్య ప్రతాపం తగ్గిపోయింది. వేసవితాపం, ఉక్కపోత, వడగాల్పుల మధ్య నెలల తరబడి అలమటించిన జిల్లా ప్రజలు చల్లదనంతో సాంత్వన పొందారు. ఇదిలా ఉండగా రాగల నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో ఈ నెల 27 వరకు ఆరెంజ్ తో పాటు ఎల్లో అలర్ట్ ఉందన్నారు. 23న 8 మి.మీ, 24న 10 మి.మీ, 25న 0.5 మి.మీ, 26న 6 మి.మీ, 27న 7 మి.మీ మేర సగటు వర్షపాతం నమోదు కావచ్చన్నారు. అక్కడక్కడా 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయన్నారు. ఉక్కపోతతో పాటు వర్షం, గాలులు సంభవించే వాతావరణం ఉంటుందని తెలిపారు.
వైఎస్సార్‌సీపీ నేత బైండోవర్
● ప్రొ.నాగేశ్వర్ వీడియోను షేర్
చేయడంతో చర్యలు
చిలమత్తూరు: పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను చంద్రబాబు ప్రభుత్వం హరిస్తోంది. చివరకు ఇతరులు చేసిన వీడియోను షేర్ చేసినా కేసులు పెట్టి వేధిస్తోంది. ఈ క్రమంలోనే ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడన్న కారణంతో వైఎస్సార్‌సీపీ రజక విభాగం జిల్లా అధ్యక్షుడు సి.రమేష్‌ను చిలమత్తూరు పోలీసులు శుక్రవారం బైండోవర్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఆయన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయొద్దండంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సూచించినట్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో పోలీసులు రమేష్‌పై చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలను వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి తప్పుపట్టారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా..? లేక నియంతృత్వ పరిపాలనలో ఉన్నామా అర్థం కావడం లేదన్నారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. బైండోవర్లు చేసి పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టొద్దని పోలీసులను కోరారు. రమేష్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
నీటి కోసం మహిళల నిరసనాగ్రహం
● చిలమత్తూరులో ఖాళీ బిందెలతో రాస్తారోకో
● బాలకృష్ణ ఇలాకాలో తాగునీరు కరువు
చిలమత్తూరు: పాలకులు పట్టించుకోరు...అధికారులు కళ్లుండీ కన్నీటి కష్టాలు చూడటం లేదు.. దీంతో విసిగిపోయిన జనం రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ఖాళీ బిందెలతో రోడ్లపై బైఠాయిస్తున్నారు. సీఎం బావమరిది బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో గుక్కెడు నీరు కరువు కావడంతో రోజుకో గ్రామానికి చెందిన మహిళలు ఆందోళనకు దిగుతున్నారు. తాజాగా చిలమత్తూరు బీసీ కాలనీ మహిళలు తాగునీటి సమస్య పరిష్కారానికి ఖాళీ బిందెలతో నడిరోడ్డుపై నిరసనకు దిగారు. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, నాయకులు తమ సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. రోడ్కెక్కి తమ సమస్య చెప్పుకున్నా కనీసం పట్టించుకోవడం లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డుపైకి చేరుకుని వాహనాలను ఆపేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్ది చెప్పారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ కావడంతో అధికారులు అప్పటికప్పుడు ఒక ట్యాంకర్ పంపించి చేతులు దులుపుకున్నారు.


