‘స్పాట్‌ బిల్లింగ్‌’ టెండర్లు పిలిచేవారేరీ? | - | Sakshi
Sakshi News home page

‘స్పాట్‌ బిల్లింగ్‌’ టెండర్లు పిలిచేవారేరీ?

May 23 2026 1:34 AM | Updated on May 23 2026 1:34 AM

అనంతపురం టౌన్‌: నెలవారీ విద్యుత్‌ వినియోగాన్ని బట్టి బిల్లులు ఇచ్చే స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్టు గడువు ముగిసినా కొత్త కాంట్రాక్టులకు టెండర్లు పిలవడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇద్దరే కాంట్రాక్టర్లు స్పాట్‌ బిల్లింగ్‌ టెండర్లు దక్కించుకున్నారు. మార్చి నెలకు టెండర్‌ గడువు ముగిసింది. అయితే అధికారులు కొత్తగా టెండర్లు పిలవకుండా పాత వారికే నెలనెలా పొడిగిస్తూ వస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు విద్యుత్‌ డివిజన్ల పరిధిలో దాదాపు 16 లక్షలకు పైగా సర్వీసు కనెక్షన్లు ఉన్నాయి. వీటిని 24 సబ్‌ డివిజన్లుగా విభజించి.. స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్టుకు టెండర్లు పిలవాల్సి ఉంది.

నిబంధనలు పాటించని అధికారులు

స్పాట్‌ బిల్లింగ్‌ టెండర్ల విధానంలో విద్యుత్‌శాఖ అధికారులు నిబంధనలు పాటించడంలేదు. టెండర్ల గడువు ముగిసిన వెంటనే టెండర్లు పిలవకుండా ప్రజాప్రతినిధుల ఒత్తిడితో పాతవారినే కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ‘చిన్న బాస్‌’గా పిలిచే ఓ మంత్రితో విద్యుత్‌ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి గతంలో టెండర్లు పొందారు. 413 మందిపైగా కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొంటే అందరినీ పక్కన పెట్టి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 24సబ్‌ డివిజన్లను వీరికే కట్టబెట్టారు. టెండర్లు దక్కించుకున్న నాటి నుంచి నేటి వరకు విద్యుత్‌ సంస్థకు సక్రమంగా డిపాజిట్లు సైతం చెల్లించలేదని తెలుస్తోంది. అలాంటి కాంట్రాక్టర్లనే కొనసాగించడం విమర్శలకు దారితీస్తోంది. ప్రతి నెలా రూ.90 లక్షలకు పైగా బిల్లులు తీసుకుంటున్న కాంట్రాక్టర్లు బిల్లింగ్‌ రీడర్లకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. జీతాలు అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నా విద్యుత్‌ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. వెంటనే విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి స్పాట్‌ బిల్లింగ్‌కు టెండర్లు పిలవాల్సిన అవసరం ఉంది.

గడువు ముగిసి రెండు నెలలు పూర్తి

పాత కాంట్రాక్టర్లకే ప్రతి నెలా పొడిగింపు

బిల్లు రీడర్లకు సకాలంలో వేతనాలు ఇవ్వని కాంట్రాక్టర్లు

ఆదేశాలు రాగానే టెండర్లు పిలుస్తాం

ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ నుంచి ఆదేశాలు రాగానే స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్టుకు సంబంధించి టెండర్లు పిలుస్తాం. ప్రస్తుతం బిల్లింగ్‌ ఆలస్యమతుందనే ఉద్దేశంతోనే నెల నెలా పొడిగించుకుంటూ వస్తున్నాం. వినియోగదారులకు సకాలంలో విద్యుత్‌ బిల్లులు ఇచ్చే బాధ్యత మాపై ఉంది.

– శేషాద్రిశేఖర్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ

Advertisement
 
Advertisement
Advertisement