‘మైనింగ్‌’ కోసం మంత్రాంగం | - | Sakshi
Sakshi News home page

‘మైనింగ్‌’ కోసం మంత్రాంగం

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

చిలమత్తూరు: మైనింగ్‌ మాఫియా పెద్ద మంత్రాంగం నడిపింది. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఉత్తుత్తి ప్రజాభిప్రాయసేకరణ చేపట్టింది. ఎవరికీ తెలియకుండా కొండ ప్రాంతంలో గ్రామ సభ నిర్వహించి గ్రామస్తుల ముసుగులో అక్కడికి హాజరైన తమవారితో అనుకూలంగా చెప్పించి అనుమతులు పొందేందుకు ప్లాన్‌ వేసింది. విషయం తెలుసుకున్న చివరి నిమిషంలో గ్రామస్తులు అక్కడికి వెళ్లడంతో వారి గుట్టురట్టయ్యింది.

ఏం జరిగిందంటే..

మండలంలోని యగ్నిశెట్టిపల్లి సమీపంలోని శ్రీధర గుట్ట వద్ద ఉన్న కొండల్లో మైనింగ్‌ కోసం ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో పర్యావరణ అనుమతుల కోసం కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా బుధవారం గ్రామ సభ నిర్వహించారు. పర్యావరణ చట్టాల ప్రకారం 30 రోజుల ముందే ప్రజలకు సమాచారం ఇవ్వాల్సి ఉండగా... అవేవీ చేయకుండానే గుట్టుగా గ్రామానికి దూరంగా కొండ ప్రాంతంలో సభ ఏర్పాటు చేశారు. గ్రామస్తుల ముసుగులో తమకు అనుకూలమైన వారిని అక్కడికి తరలించారు. ఇక పర్యావరణ వేత్తలమని కొందరు, ఎన్‌జీఓలమని మరి కొందరు విచ్చేశారు. ముందుగానే అనుకున్న ప్లాన్‌ ప్రకారం అంతా తమవారితోనే మాట్లాడించారు. ఈ క్రమంలో స్థానిక టీడీపీ నేత అంజినప్ప మాట్లాడుతూ.. మైనింగ్‌ చేసుకోవడంలో తమకేమీ అభ్యంతరం లేదని, పైగా కంకర కోసం తమకు ట్రాన్స్‌పోర్టు ఖర్చులు తగ్గుతాయని చెప్పారు. ఇక ఎన్‌జీఓల మంటూ అక్కడికొచ్చిన కొందరు మైనింగ్‌ కు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. అంతా సవ్యంగా సాగుతుందని సంబరపడిన మైనింగ్‌ మాఫియాకు చివరి నిమిషంలో గ్రామస్తులు షాక్‌ ఇచ్చారు.

‘మైనింగ్‌’కు అంగీకరించం..

శ్రీధరగుట్ట సమీపంలో మైనింగ్‌ కోసం గ్రామ సభ జరుగుతున్నట్లు తెలుసుకున్న పలువురు రైతులు హడావుడిగా అక్కడికి వచ్చారు. తమకు సమాచారం ఇవ్వకుండా గ్రామసభ ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. ఇప్పటికే ఇష్టారాజ్యంగా పేలుళ్లు జరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని, పంట పొలాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మైనింగ్‌ వద్దంటూ అధికారుల ముందు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు నెలకు రూ.8 వేలు ఇస్తామని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, ఆ పొలంలో రేషం మేపుకొని నెలకు రూ.50 వేలకు పైగా సంపాదించేవాడినని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనాధారంపై దెబ్బకొట్టే మైనింగ్‌ వద్దంటూ తేల్చిచెప్పారు.

అధికారుల తీరుపై ఆగ్రహం..

ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఎన్‌జీఓ నిర్వాహకుల పేరుతో వచ్చిన వారితో, టీడీపీ నేతలతో అభిప్రాయాలను అధికారులు నోట్‌ చేసుకోవడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమస్య ఎదుర్కొనే తమ అభిప్రాయం కాకుండా ఎవరినో అడిగి వాటినే రాసుకోవడం అన్యాయమన్నారు. కలెక్టర్‌ వెంటనే ఈ అక్రమ గ్రామసభను పరిగణనలోకి తీసుకోకుండా గ్రామస్తుల అభిప్రాయాలనే తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

శ్రీధరగుట్ట సమీపంలో మైనింగ్‌ కోసం ప్రజాభిప్రాయ సేకరణ

గుట్టుగా గ్రామానికి దూరంగా

కొండ ప్రాంతంలో గ్రామసభ

తమకు అనుకూలమైన వారితో నిర్వహణ

విషయం తెలిసి అక్కడివెళ్లి

నిలదీసిన జనం

రిజర్వు ఫారెస్ట్‌ సరిహద్దులో

మైనింగ్‌ అనుమతులపై ఆగ్రహం

Advertisement
 
Advertisement
Advertisement