పన్ను వసూళ్లను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పన్ను వసూళ్లను వేగవంతం చేయాలి

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

ప్రశాంతి నిలయం: జిల్లాలో జీఎస్టీ, వృత్తి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సెంట్రల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జిల్లాలో జీఎస్టీ రెవెన్యూను గణనీయంగా పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ వసూళ్లను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ స్వర్ణలత, పుట్టపర్తి ఏసీ చందు, హిందూపురం ఏసీ కృష్ణవేణి, ఏడీ అమీర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌లో మందులు విక్రయించొద్దు

కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌

నేతల డిమాండ్‌

జిల్లా వ్యాప్తంగా మెడికల్‌ స్టోర్ల బంద్‌

హిందూపురం టౌన్‌: ఆన్‌లైన్‌ మందుల (మెడిసిన్‌)అమ్మకాలను నిలుపుదల చేయాలని ఆలిండియా కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్టిస్ట్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. ఆన్‌లైన్‌లో హానికర, మత్తు పదార్థాల అమ్మకాలు చేస్తున్నారని, ఫలితంగా యువత మత్తుకు బానిస అవుతోందని ధ్వజమెత్తారు. ఆన్‌లైన్‌ అమ్మకాల నిలుపుదల చేయాలనే ప్రధాన డిమాండ్‌తో దేశ వ్యాప్తంగా 12.50 లక్షల మెడికల్‌ స్టోర్లను బుధవారం మూసివేశారు. జిల్లా వ్యాప్తంగా మెడికల్‌ స్టోర్లను మూసి వేసి ఆందోళన నిర్వహించారు. ఈక్రమంలోనే హిందూపురం కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ సభ్యులు మాట్లాడుతూ...కరోనా సమయంలో అందరికీ అందుబాటులోకి రావాలని ఆన్‌లైన్‌లో మందులు అమ్మకం చేశారన్నారు. కానీ ఈ అవకాశాన్ని వెసులుబాటుగా చేసుకున్న కొందరు అక్రమంగా నిషేధిత మందులు అమ్ముతున్నారన్నారు. అందువల్ల ఆన్‌లైన్‌ ద్వారా మందుల అమ్మకాలను నిషేధించాలని, నాసిరకం మందులను అరికట్టాలని, జీఎస్‌ఆర్‌ 220ఈను రద్దు చేయాలన్నారు. సామాన్య కెమిస్ట్‌, ఫార్మసిస్టుల హక్కులను కాపాడాలని, ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ పట్టణాధ్యక్షుడు శివకుమార్‌, ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌, ట్రెజరర్‌ రాజేష్‌, హిందూపురం, పరిగి, లేపాక్షి, చిలమత్తూరు మెడికల్‌ షాపుల యజమానులు పాల్గొన్నారు.

వివాహితకు వేధింపులు.. యువకుడికి అరగుండు

విడపనకల్లు: ప్రేమపేరుతో వివాహితను వేధించినందుకు ఓ యువకుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేసి అరగుండు గీయించి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటన విడపనకల్లు మండలం గడేకల్లు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గడేకల్లు గ్రామంలో భాస్కర్‌ అనే యువకుడు కొంతకాలంగా వివాహితను ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. దీనివల్ల ఆమె కుటుంబంలో కలతలు వచ్చాయి. ఇందుకు ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బుధవారం అతనికి దేహశుద్ధి చేశారు. అర గుండు గీయించారు. మెడలో చెప్పుల దండ వేసి.. డప్పు వాయిస్తూ గ్రామమంతా ఊరేగించారు. ఎవరైనా సరే అమ్మాయిలను, మరీ ముఖ్యంగా వివాహితలను వేధిస్తే ఇదే శాస్తి జరుగుతుందని హెచ్చరించారు. కాగా.. ఈ ఘటనపై విడపనకల్లు పోలీసులు విచారణ చేశారు. వివాహిత వేధించిన భాస్కర్‌పై కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement