తాగునీరు ఇవ్వండయ్యా! | - | Sakshi
Sakshi News home page

తాగునీరు ఇవ్వండయ్యా!

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

అధికారులకు ముదిగుబ్బవాసుల మొర

తాగునీటి సమస్యపై రాస్తారోకో

ముదిగుబ్బ: ‘‘మండల కేంద్రంలో రెండు నెలలుగా తాగునీటి సమస్య నెలకొంది. అడుక్కున్నాం... ధర్నాలు చేశాం.. కార్యాలయాలను ముట్టడించాం..ఇంకేం చేస్తే నీళ్లిస్తారో చెప్పండి..మాకు కాసిన్ని నీళ్లు సరఫరా చేయండయ్యా’’ అంటూ ముదిగుబ్బ వాసులు అధికారులకు మొరపెట్టుకున్నారు. మండల కేంద్రంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి రెండోరోజు బుధవారం కూడా ప్రజలు ముదిగుబ్బలో రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపైకి చేరుకొని రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మహిళలు ర్యాలీగా, వివిధ పార్టీల నేతలు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి ముట్టడించారు. మహిళలకు మద్దతుగా సీపీఐ, వైఎస్సార్‌ సీపీతో పాటు పలు పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ... రెండు నెలలైనా తాగునీటి సమస్య పరిష్కరించకపోవడం దుర్మార్గమన్నారు. బోర్లను తక్షణం రిపేరీ చేయించి తాగునీటిని అందించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా సత్యసాయి తాగునీటి సరఫరా కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ మహేశ్వర్‌రెడ్డికి, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ ప్రసాద్‌కు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మల్లాగుండ్ల భాస్కర్‌, చిన్న బాలముని, సీపీఐ నాయకులు శ్రీనివాసులు, తుమ్మల మధు, అలిమినేని రామాంజనేయులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement