కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిమట్టం తగ్గుతున్న క్రమంలో.. గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఏబీఆర్ జలాశయం వాస్తవ నీటిమట్టం 11.1 టీఎంసీలు కాగా.. బుధవారం నాటికి 2.3 టీఎంసీలకు చేరుకుంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం కారణంగా ఎలాంటి ఇన్‌ఫ్లో లేదు. తాగునీటి పథకాలకు సంబంధించి రోజూ 35 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక నీటి ఆవిరి, లీకేజీల రూపంలో మరో 100 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. నీటి మట్టం తక్కువగా ఉన్నా.. తాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి నీటి కొరత ఉండదని రిజర్వాయర్ అధికారులు తెలిపారు.
ట్రాక్టర్ కింద
పడి యువకుడి మృతి
రొద్దం: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. రొద్దం మండలం కోగిర గ్రామానికి చెందిన మాల వెంకటరమణ కుమారుడు శివ (23) కూలి పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఓ రైతు పొలానికి ట్రాక్టర్ ద్వారా చెరువు మట్టిని తరలించే పనికి వెళ్లాడు. పొలం వద్ద మట్టిని అన్‌లోడ్ చేసేందుకు ట్రాలీ పైకెత్తుతుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ ముందుకు కదిలింది. ట్రాక్టర్ ముందున్న శివ తప్పించుకునేలోపు అతని మీదుగా చక్రాలు దూసుకెళ్లాయి. ఘటనలో తీవ్రంగా గాయపడడంతో వెంటనే పనుకొండలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురానికి తరిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రశాంత్‌కుమార్
పుట్టపర్తి టౌన్: ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా బుక్కపట్నం నివాసి పోలేపల్లి ప్రశాంత్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం కర్నూలు నగరంలోని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కార్యాలయంలో ఆర్య వైశ్య సంఘం గౌరవాధ్యక్షుడు టీజీ వెంకటేష్, మహాసభ అధ్యక్షుడు ఇల్లూరి లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ ఎంపిక జరిగింది.
ఎనిమిదేళ్లయినా పెన్షన్ లేదు
కదిరి అర్బన్: ఆర్టీసీలో 30 ఏళ్లు డ్రైవర్‌గా పనిచేసి 2019లో ఉద్యోగ విరమణ చేసిన తనకు ఇప్పటి వరకూ ఈపీఎఫ్ పెన్షన్ మంజూరు చేయలేదని కదిరి డిపో విశ్రాంత ఉద్యోగి గంగప్ప వాపోయాడు. రిటైర్‌మెంట్‌కు ముందుగానే పెన్షన్ పేపర్లను అధికారులకు పంపినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. బర్కత్‌పురలోని కార్యాలయానికి వెళ్లి ఆరా తీస్తే అక్కడి అధికారులు వాటిని పోగొట్టినట్లు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారన్నారు. కార్యాలయం చుట్టూ తిరగడంతోనే తాను అనారోగ్యం పాలయ్యానని, ఇప్పటికై నా తన సమస్యకు పరిష్కారం చూపాలని ఆర్టీసీ ఎండీ, రవాణా శాఖా మంత్రికి విన్నవించినట్లు వివరించాడు.
పెన్నహోబిలంలో
హుండీ కానుకల లెక్కింపు
ఉరవకొండ రూరల్: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. శాశ్వత హుండీల ద్వారా రూ.25,96,507, అన్నదాన హుండీ ద్వారా రూ.1,109 మొత్తం రూ25,97,616 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ సాకే రమేష్‌బాబు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే రూ.10,11,728 ఆదాయం పెరిగినట్లు వివరించారు. దేవదాయ శాఖ ఏసీ గంజి మల్లికార్జునప్రసాద్, ఆలయ కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు పర్యవేక్షించారు. కార్యక్రమంలో గుంతకల్లు హనుమాన్ సేవా సమితి సభ్యులు, అనంతపురం భవానీ సేవా సమితి సభ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.


