విద్యార్థులు లేకున్నా పోస్టులు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు లేకున్నా పోస్టులు

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో బోధన పోస్టుల భర్తీకి ఈ నెల 15న నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో ప్రాధాన్యత లేని విభాగాలకు ప్రొఫెసర్‌ పోస్టులు కేటాయించడం, అప్రాధాన్యత గల విభాగాలకు రిక్తహస్తం చూపించడం విమర్శలకు తావిస్తోంది. వాస్తవానికి ప్రొఫెసర్‌ పోస్టుల కేటాయింపునకు విద్యార్థుల అడ్మిషన్లే ప్రామాణికం. అయితే విద్యార్థులు లేని విభాగాలకూ పోస్టులు నిర్ధారించడం గమనార్హం. రోస్టర్‌ కమిటీల్లో ఉన్న ప్రొఫెసర్లు తమ విభాగాలకు అనుకూలంగా నివేదిక సమర్పించి.. ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరు చేయించుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని, యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఏకంగా తప్పుదోవ పట్టించి పోస్టుల కేటాయింపులో పక్షపాతం ప్రదర్శించారు. దీంతో కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

కేటాయింపులో పారదర్శకతేదీ?

ఎస్కేయూ క్యాంపస్‌ కళాశాలలోని పలు విభాగాల్లో మూడేళ్ల నుంచి ఒక్క అడ్మిషన్‌ కూడా లేదు. అయినప్పటికీ అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు కేటాయించారు. అనుకూలమైన రోస్టర్‌ పాయింట్‌ వచ్చే వరకు పోస్టులు పెంచడం.. లేదా తగ్గించడంపై అనుమానాలు బలపడుతున్నాయి.

● సోషియాలజీలోనూ మూడు సంవత్సరాలుగా అడ్మిషన్లు లేకపోయినా అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను కేటాయించారు.

● ఆర్ట్స్‌లో పొలిటికల్‌ సైన్సెస్‌ విభాగంలో అధికంగా విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ రెండు అసిస్టెంట్‌, ఒక అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు మాత్రమే కేటాయించారు.

● జాగ్రఫీలో మూడు విద్యాసంవత్సరాల్లో వరుసగా అడ్మిషన్లు నమోదు కాలేదు. వచ్చే జూన్‌కు రెగ్యులర్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగ విరమణ చేస్తారు. నోటిఫికేషన్‌లో ఒక అసిస్టెంట్‌, ఒక అసోసియేట్‌ ప్రొఫెసర్‌ను కేటాయించారు.

● ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో సెకండియర్‌కు విద్యార్థులే లేరు. అయినా అసోసియేట్‌, రెండు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఇచ్చారు.

● పాలిమర్‌ సైన్సెస్‌కు ఒక్క విద్యార్థీ లేరు. అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను కేటాయించారు.

● హిస్టరీలో తక్కువ అడ్మిషన్లు ఉన్నప్పటికీ అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు ఇచ్చారు.

● ఇంజినీరింగ్‌ కళాశాలలో శాంక్షన్‌ పోస్టులు లేవు. కంప్యూటర్‌ సైన్సెస్‌కు మూడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఈఈఈకి ఒక పోస్టు, ఈసీఈకి రెండు పోస్టులు, మెకానికల్‌ ఇంజినీరింగ్‌కు ఒక అసిస్టెంట్‌.. ఇవి కాకుండా ఆరు ప్రొఫెసర్‌ పోస్టులు కేటాయించారు. నాలుగు ప్రొఫెసర్లు పోస్టులు మాత్రమే ఎస్కేయూ క్యాంపస్‌ కళాశాలల్లోని విభాగాలకు కేటాయించారు. మొత్తం 10 ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ చేస్తుంటే.. ఆరు పోస్టులు ఇంజినీరింగ్‌ కళాశాలకు, తక్కిన నాలుగు పోస్టులు క్యాంపస్‌ కళాశాలకు కేటాయించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సంప్రదాయ యూనివర్సిటీలో శాంక్షన్‌ పోస్టులు లేని ఇంజినీరింగ్‌ కళాశాలకు సింహభాగం ప్రొఫెసర్‌ పోస్టులు కేటాయించి నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారు.

● ఎడ్యుకేషన్‌ విభాగంలో అడ్మిషన్లు గణనీయంగా ఉన్నాయి. అయినప్పటికీ ఒక్క పోస్టు కూడా కేటాయించలేదు.

పోస్టుల భర్తీ ఇలా...

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో రెగ్యులర్‌ పోస్టులు 81 ఖాళీలు ఉన్నాయి. బ్యాక్‌లాగ్‌ 22 పోస్టులు ఉన్నాయి. మొత్తం 103 పోస్టులు ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌– 49, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ – 22, ప్రొఫెసర్‌– 10 పోస్టులతో పాటు బ్యాక్‌లాగ్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ –18, అసోసియేట్‌ –4 పోస్టులు భర్తీ చేయనున్నారు.

ప్రొఫెసర్‌ పోస్టుల కేటాయింపులో పక్షపాతం

ఎస్కేయూ బోధనా పోస్టుల భర్తీపై విమర్శలు

Advertisement
 
Advertisement
Advertisement