జిల్లాను ప్రగతి పథంలో నిలపాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లాను ప్రగతి పథంలో నిలపాలి

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

ప్రశాంతి నిలయం: జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నిలపాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 32 మండలాలకు సంబంధించి స్వచ్ఛ భారత్‌ మిషన్‌, ‘సాసా’ ప్రగతి ర్యాంకులను జిల్లా యంత్రాంగం వెల్లడించిందన్నారు. 84 పాయింట్లతో మడకశిర, అమరాపురం మండలాలు సంయుక్తంగా మొదటి స్థానంలో ఉండగా... 83 పాయింట్లతో రొళ్ల మండలం ఆ తర్వాతి స్థానంలో ఉందన్నారు. 65 పాయింట్లతో హిందూపురం జిల్లాలోనే చివరి స్థానంలో ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఓడీఎఫ్‌ 100 శాతం సాధించగా, చెత్త సేకరణ 59.62 శాతం నమోదైందన్నారు. జిల్లాలో 3,366 సౌర విద్యుత్‌ యూనిట్ల స్థాపన పూర్తి కాగా, 1,108 దరఖాస్తులను సబ్సిడీ జమ చేసినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కొండయ్య పాల్గొన్నారు.

పిడుగుపాటుకు

రెండు ఎద్దులు మృతి

శింగనమల: మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందిద. ఏకులనాగేపల్లిలో పిడుగుపాటుకు రైతు వసంతకుమార్‌ రెడ్డికి చెందిన రెండు ఎద్దులు చనిపోయాయి. రెండు వారాల క్రితమే వాటిని రైతు కొనుగోలు చేశారు. దాదాపు రూ.1.50 లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు.

టెంకాయ చెట్టుపై పిడుగు

గార్లదిన్నె: మండల వ్యాప్తంగా గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసింది. ఎం.కొత్తపల్లి గ్రామంలో రైతు కిష్ట ఇంటి వెనుక ఉన్న టెంకాయ చెట్టుపై పిడుగు రాలడంతో మంటలు చెలరేగాయి. అలాగే కల్లూరు, ఇల్లూరులో వడగండ్ల వర్షం కురిసింది.

వ్యక్తి దుర్మరణం

అనంతపురం సెంట్రల్‌: బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... శింగనమల మండలం నిదనవాడకు చెందిన శేషానందరెడ్డి(40) బుధవారం అనంతపురంలోని తపోవనం నుంచి 44వ జాతీయ రహదారి సర్వీసు రోడ్డు మీదుగా బళ్లారి మార్గం వైపుగా ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎదురుగా దూసుకొచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. తలకు తీవ్ర గాయం కావడంతో శేషానందరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ సీఐ వెంకటేష్‌ నాయక్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement