కదిరి అర్బన్: వేసవిని దృష్టిలో ఉంచుకుని ఉపాధి పనుల ప్రాంతంలో కూలీలకు నీడ, నీరు కల్పించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. బుధవారం ఆయన నడింపల్లి సమీపంలో ఎర్రగుట్ట నుంచి ఎర్రకుంటకు చేపట్టిన ఫీడర్ ఛానల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పలుగు, పార చేతపట్టి కాసేపు కూలీలతో కలిసి కాలువలో మట్టి తీశారు. అంతకుముందు గ్రామంలో ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ సేకరణ పనులపై గ్రామస్తులతో మాట్లాడారు. కలెక్టర్ వెంట డీఎల్‌డీఓ వెంకటరత్నం, ఎంపీడీఓ పోలప్ప, తహసీల్దార్ రెడ్డిశేఖర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
నైపుణ్యంతోనే ఉజ్వల భవిత..
నైపుణ్యం కలిగితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, యువకులు ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. బుధవారం ఆయన కదిరి ఎస్టీఎస్‌ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఏంకేవీవై) శిక్షణ తరగతులను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌తో కలిసి కళాశాలకు వచ్చిన ఆయన ట్రైనర్లతో మాట్లాడారు. ఏ అంశాలపై, ఎంతమందికి శిక్షణ ఇస్తున్నారని ప్రశ్నించగా.. సంప్రదాయ వృత్తులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) డ్రోన్ టెక్నాలజీ, 5జీ టెక్నాలజీ వంటి సాంకేతిక నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నట్లు ట్రైనర్లు తెలిపారు. అనంతరం శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి వారికి టీషర్ట్‌లను కలెక్టర్ పంపిణీ చేశారు. కలెక్టర్ వెంట కళాశాల ప్రిన్సిపాల్ డా. స్మిత, పలువురు అధ్యాపకులు ఉన్నారు.
అధికారులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం


