బాలుడిని తల్లి వద్దకు చేర్చిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

బాలుడిని తల్లి వద్దకు చేర్చిన పోలీసులు

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

తాడిపత్రి రూరల్‌: కుటుంబసభ్యులు బలవంతంగా తీసుకెళుతున్న బాలుడిని పోలీసులు సకాలంలో కాపాడి తల్లి వద్దకు చేర్చారు. వివరాలు.. తాడిపత్రిలోని అంబేడ్కర్‌ నగర్‌లో నివాసముంటున్న ఆంజనేయులుకు పదేళ్ల క్రితం శ్రీసాయితో వివాహమైంది. వీరికి 8 ఏళ్ల వయసున్న కుమారుడు అభిరామ్‌ ఉన్నాడు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే ఆంజనేయులు నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో మరణించాడు. అప్పటి నుంచి శ్రీసాయి పలు ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ కుమారుడిని చదివించుకుంటోంది. ఇటీవల పెయింటర్‌ రాముతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో రెండు రోజుల క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయులు తల్లి, కుటుంబసభ్యులు బుధవారం శ్రీసాయి ఇంటి వద్దకు చేరుకుని గొడవ పడ్డారు. మరో వ్యక్తిని వివాహం చేసుకోవడంతో తమ వారసుడు అభిరామ్‌ను అప్పగించాలంటూ అత్తతో పాటు ఆంజనేయులు సోదరులు శివ, మధు ఒత్తిడి చేశారు. అయితే కుమారుడిని అప్పగించేందుకు శ్రీసాయి నిరాకరించింది. దీంతో ఆమెను కొట్టి అభిరామ్‌ను బలవంతంగా ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని శివ, మధు వెళ్లిపోయారు. అనంతరం మిగిలిన కుటుంబసభ్యులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో శ్రీసాయి ఏడ్చుకుంటూ కిలోమీటర్‌కు పైగా ఉన్నా పట్టణ పోలీసుస్టేషన్‌కు పరుగునా వెళ్లి జరిగిన ఘటను సీఐ ఆరోహణరావుకు వివరించింది. తన కుమారుడిని వారి బారి నుంచి కాపాడి తనకు అప్పగించాలని ప్రాధేయపడింది. స్పందించిన సీఐ వెంటనే శ్రీసాయి అత్తింటి వారి వివరాలు ఆరా తీసి సిబ్బందిని వెంటబెట్టుకుని వెళ్లారు. టైలర్స్‌ కాలనీలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న శివ, మధుని వెంబడించి బాలుడిని కాపాడి ఏఎస్పీ రోహిత్‌కుమార్‌ సమక్షంలో హాజరుపరిచారు. వివాదానికి కారణమైన శ్రీసాయి అత్తతో పాటు ఆమె కుటుంబసభ్యులను పిలిపించి, కౌన్సిలింగ్‌ ఇచ్చారు. మరోసారి శ్రీసాయి ఇంటి వద్దకెళ్లి గొడవపడినా, బాలుడిని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించి పంపించారు. తన కుమారుడిని సురక్షితంగా అప్పగించిన పోలీసులకు ఈ సందర్భంగా శ్రీసాయి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement