కార్పొరేట్‌ సేవలో చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ సేవలో చంద్రబాబు

May 20 2026 10:43 AM | Updated on May 20 2026 10:43 AM

అనంతపురం అర్బన్‌: రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి కార్పొరేట్‌ సంస్థల సేవలో సీఎం చంద్రబాబు తరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. రూ.కోట్ల విలువైన భూములను కారుచౌకగా కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. స్వాతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని అనంతపురంలోని శాంతినగర్‌ సర్కిల్‌ సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. నగర కార్యదర్శి రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీనివాసరావుతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్‌, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ ముఖ్యఅతిథులుగా హాజరై సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల ఎకరాలను కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెట్టిన సీఎం చంద్రబాబు తీరును తప్పుబట్టారు. విశాఖలో దేవదాయ భూములను కంపెనీలకు కట్టబెడుతున్నా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు నోరు మెదపడం లేదని విమర్శించారు. ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం వెనుక ప్రధానంగా కార్పొరేట్‌ ప్రయోజనాలే ఉన్నాయన్నారు. కంపెనీలకు బానిసలుగా మార్చి శ్రమదోపిడీ చేయడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పేద పిల్లలకు సరైన వైద్యం లేదు.. విద్య లేదు... పౌష్టికాహారం లేదన్నారు. మాత శిశుమరణాలు సంభవిస్తూనే ఉన్నాయన్నారు. వాటి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టలేని సీఎం చంద్రబాబు... పిల్లల్ని కనమనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానాల కారణంగా ప్రజలపై ఆర్థిక భారం పెరిగిపోతోందన్నారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా బీజేపీ వ్యహరిస్తోందని మండిపడ్డారు. ‘సర్‌’ పేరుతో బెంగాల్‌లో 34 లక్షల ఓటు తొలగించారన్నారు. ఏడు లక్షల దొంగ ఓట్లతో గెలిచి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి ఇరాన్‌, రష్యాల నుంచి చమురు కొనుగోలును మోదీ నిలిపివేశారన్నారు. కేజీ బేసిన్‌లో 21 వేల టన్నుల గ్యాస్‌ లభిస్తుండగా రాష్ట్రానికి దక్కాల్సిన 50 శాతాన్ని గుజరాత్‌కు తరలించి అమ్ముకుంటున్నా ప్రశ్నించలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్‌ నాయకుడు ఓబుళు, నగర కార్యదర్శి ఓ.నల్లప్ప, నాయకులు బాలరంగయ్య, వలి, ముత్తుజ, ప్రకాశ్‌రెడ్డి, మసూద్‌, పాల్గొన్నారు.

రూ.కోట్ల విలువైన భూములను కారుచౌకగా కట్టబెడుతున్నారు

పౌష్టికాహారం ఇవ్వలేని సీఎం... పిల్లల్ని కనమనడం దుర్మార్గం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

Advertisement
 
Advertisement
Advertisement