ముదిగుబ్బ: మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలో తాగునీటి ఇక్కట్లు తీవ్రమయ్యాయి. మూడు నెలలుగా నెలకొన్న తాగునీటి సమస్యపై అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ మంగళవారం మహిళలు పెద్ద ఎత్తున ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులను బయటకు పంపి కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకుడు శ్రీనివాసులు మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ముదిగుబ్బకు తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని సత్యకుమార్ హామినిచ్చారని గుర్తు చేశారు. గెలిచిన తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికీ ఈ ప్రాంతం వైపుగా కన్నెత్తి చూడడం లేదని మండిపడ్డారు. ముదిగుబ్బలోని 20వేల జనాభాకు సరిపడా నీటిని సరఫరా చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించుకుంటే బుధవారం పెద్ద ఎత్తున రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. కాగా, తాగునీటి కోసం మహిళలు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన సమయంలో ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆయనను కార్యాలయంలోకి వెళ్లకుండా మహిళలు అడ్డుకున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించలేని వారికి పదవులు ఎందుకని నిలదీశారు. కార్యక్రమంలో ముల్లగూరు ఆనంద్, అన్నమనేని దామోదర్‌నాయుడు, చల్లా శంకర్ నాయుడు, తుమ్మల శ్రీనివాసులు, తుమ్మల మధు, హరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించిన మహిళలు
మాట నిలబెట్టుకోలేదని మంత్రిపై మండిపాటు


