అంకితభావంతో పనిచేసే వారికి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

అంకితభావంతో పనిచేసే వారికి గుర్తింపు

Mar 31 2026 8:56 AM | Updated on Mar 31 2026 8:56 AM

అనంతపురం: పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకరబాబు అన్నారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు అధ్యక్షతన ఎస్సీ సెల్‌ రాయలసీమ జోనల్‌ స్థాయి సమావేశం అనంతపురం నగరంలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో సోమవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీజేఆర్‌ సుధాకరబాబు, విశిష్ట అతిథిగా ఎస్సీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు హాజరై, మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యలు, అత్యాచారాలు, భూ కబ్జాలతో ఎస్సీల పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని, రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఎస్సీల అభ్యున్నతి కేవలం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమైందన్నారు. ఏడాదికి రూ.13 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో ఎస్సీ వర్గాల అభ్యున్నతికి రూ.77వేల కోట్లను అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ ఖర్చు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో ఇప్పటి వరకూ ఎస్సీల సంక్షేమానికి నయా పైసా కూడా ఖర్చు పెట్టలేదన్నారు. ఈ లెక్కన ఇప్పటికే రూ.26 వేల కోట్లను ఎస్సీలు నష్టపోయారని వివరించారు. దళితులకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని నాడు వైఎస్‌ జగన్‌ ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారన్నారు. నేడు మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ చేస్తే తొలుత నష్టపోయేది ఎస్సీ విద్యార్థులేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్సీల హక్కుల సాధనకు రాబోవు రోజుల్లో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో తలపెట్టనున్న కార్యక్రమాలను వివరించారు. జిల్లా స్థాయి కార్యాచరణ ప్రకటించి ఆ మేరకు కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు.

ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు

మల్లెమీద నరసింహులు మాట్లాడుతూ..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే వైఎస్‌ జగన్‌ లక్ష్యమని, ఆ దిశగానే ఆయన పాలన సాగిందని గుర్తు చేశారు. 70 శాతం బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తన మంత్రి వర్గంలో స్థానం కల్పించారన్నారు.

ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు మాట్లాడుతూ..

రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత బాలిక పట్ల జరిగిన అమానుష ఘటనకు సంబంధించి దళితుడై ఉండి కూడా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు ఏనాడూ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు. దళిత బిడ్డల మానప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా.. కేవలం చంద్రబాబు తొత్తుగా మారాడని విమర్శించారు. ఇలాంటి తరుణంలో దళితులందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎగ్గుల శ్రీనివాసులు మాట్లాడుతూ... వైఎస్‌ జగన్‌ పాలనలో సంక్షేమ పథకాల్లో అగ్రస్థానం ఎస్సీలకే దక్కిందన్నారు. దళితుల ఆత్మబంధువు వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ రీజనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నల్లాని బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి లబ్బే రాఘవ, జిల్లా పరిశీలకులు శరత్‌బాబు, శ్రీ సత్యసాయి జిల్లా పరిశీలకులు మిద్దె కుళ్లాయప్ప, నంద్యాల పరిశీలకులు యోబు, కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఆర్‌.వెంకటేశ్వర్లు, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లాపురం తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు జి. నరసింహమూర్తి, వైఎస్సార్‌ కడప జిల్లా అధ్యక్షుడు ఎస్‌.వెంకటేశ్వర్లు, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆర్‌. కమలాకర్‌, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement