పరిష్కార వేదికకు 62 వినతులు | - | Sakshi
Sakshi News home page

పరిష్కార వేదికకు 62 వినతులు

Mar 31 2026 8:56 AM | Updated on Mar 31 2026 8:56 AM

పుట్టపర్తి టౌన్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 62 వినతులు అందాయి. ఎస్పీ సతీష్‌కుమార్‌ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్ట పరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ఆంకిత సురానా, లీగల్‌ అడ్వైజర్‌ సాయినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

వివాహిత ఆత్మహత్యాయత్నం

ధర్మవరం అర్బన్‌: స్థానికగీతానగర్‌కు చెందిన బేల్దారి ఏడుకొండలు భార్య పావని సోమవారం రాత్రి 10 గంటలకు ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్‌ చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తతో గొడవ పడిన ఆమె గొంతు, చెయ్యి కోసుకున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. ఘటనపై వన్‌ టౌన్‌ సీఐ నాగేంద్రప్రసాద్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

వాహనం ఢీకొని జింక మృతి

ముదిగుబ్బ: మండల కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ జింక మృతి చెందింది. సోమవారం బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ వద్ద పడి ఉన్న జింక కళేబరాన్ని గుర్తించిన స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. పశువైద్యాధికారితో పంచనామా నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

రేపు నిరాహార దీక్ష : యూటీఎఫ్‌

పుట్టపర్తి: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యల పరిష్కారం కోరుతూ ఏప్రిల్‌ 1న యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు యూటీఎఫ్‌ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు దీక్షకు అనుమతులు ఇవ్వాలంటూ జేసీ మౌర్య భరద్వాజ్‌ను సోమవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణానాయక్‌, కోశాధికారి లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి అమర్‌ నారాయణరెడ్డి మాట్లాడారు. పీఆర్సీ నియామకంతో పాటు 29 శాతం ఐఆర్‌ ప్రకటించాలని, పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలని, పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు రూట్‌ మ్యాప్‌ ప్రకటించాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని, హెల్త్‌ కార్డులు... మెడికల్‌ బిల్లుల సమస్యలు పరిష్కరించాలని, కోవిడ్‌ సమయంలో మరణించిన 953 మంది పీఆర్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు శివ, సురేష్‌, కృష్ణతేజ, జనార్దన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement