ధర్మవరం రూరల్: సెలవు రోజు ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... ధర్మవరం మండలం గొట్లూరు గ్రామానికి చెందిన నారాయణస్వామి, ఆదెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. చిన్నవాడైన కుమారుడు వెంకీ స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతుఆన్నడు. ఆదివారం సెలవు కావడంతో తన స్నేహితులతో కలసి సరదాగా ఈత కోసమని గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకెళ్లాడు. గట్టు అంచు పట్టుకుని ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. ఆలస్యంగా విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు సైతం అక్కడకు చేరుకున్నారు. ఆదివారం రాత్రంతా బావిలోని నీటిని బయటకు తోడేశారు. సోమవారం ఉదయం నీటి అడుగున చెట్ల మొద్దుకు తగులుకుని ఉన్న వెంకీ మృతదేహాన్ని వెలికి తీశారు. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదన పలువురిని కంట తడి పెట్టించింది.
గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య
పావగడ: స్థానిక పీఎస్ పరిధిలోని బొమ్మతనహళ్లి మార్గంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం అక్కడకు చేరుకుని పరిశీలించారు. డ్రిప్ పైపుల ఫ్యాక్టరీ వద్ద వేప చెట్టుకు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే 94808 02941 కు సమాచారం అందించాలని పావగడ పీఎస్ సీఐ సురేష్ కోరారు.
ఏపీఓపై దాడికి యత్నం
పరిగి: విధుల నిర్వహణలో నిర్లక్ష్యమెందుకని ప్రశ్నించిన ఏపీఓ అప్పస్వామినాయుడిపై హోన్నంపల్లి పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ సతీష్ దాడికి ప్రయత్నించాడు. సోమవారం పరిగి ఎంపీడీఓ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీరు మార్చుకోవాలని పలుమార్లు ఉపాధి అధికారులు హెచ్చరించినా మార్పు రాకపోవడంతో సోమవారం ఎంపీడీఓ కార్యాలయానికి రావాలని అధికారులు సూచించారు. దీంతో మద్యం మత్తులో కార్యాలయానికి చేరుకున్న సతీష్ దూర్భాషలాడుతూ ఏపీఓపై దాడికి ప్రయత్నించాడు. వెంటనే అధికారులు, సిబ్బంది అడుడకున్నారు. ఘటనపై ఏపీఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


