● భూములు భాగ పరిష్కారం నిమిత్తం తాను పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయంలో పని చేసే డిప్యూటీ తహసీల్దార్ అశోక్ కుమార్‌ను కలవగా... రూ.20 వేలు డబ్బులు డిమాండ్ చేశాడని, అతను అడిగినంత ఇచ్చినా పని చేయకుండా ఉడాయించాడని కర్ణాటక నాగేపల్లికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వారసత్వంగా తనకు వచ్చిన 20 సెంట్ల స్థలాన్ని తన పేరిట ఇచ్చేందుకు లంచం రూపంలో ఇతరుల ఫోన్ పే నంబరుకు డబ్బులు వేయించుకునట్లు తెలిపాడు.
● సోమందేపల్లి తహసీల్దార్ గొల్ల మారుతి ప్రసాద్ తన భార్యను వేధిస్తూ.. కుటుంబంలో చిచ్చు పెట్టారని వేణు అనే వ్యక్తి సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. అన్యోన్యంగా ఉన్న తమ దాంపత్య జీవితంలోకి ప్రవేశించి.. మాయ మాటలు చెప్పి భార్యను తనకు కాకుండా చేస్తున్నాడన్నారు. కొన్ని నెలలుగా ఆమె తనకు దూరంగా ఉంటూ.. తహసీల్దార్‌కు దగ్గర అవుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మేరకు కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అర్జీ ఇచ్చాడు.
సాక్షి, పుట్టపర్తి
రెవెన్యూ వ్యవస్థలోని కొందరు అధికారులు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. అధికారం చెలాయిస్తూ డబ్బులు డిమాండ్ చేయడం...పనికోసం వచ్చే మహిళల జీవితాల్లో ప్రవేశిస్తూ మొత్తం రెవెన్యూ శాఖకే తలవంపులు తెస్తున్నారు. ముఖ్యంగా పైసలు ఇవ్వందే ఫైలు కదలడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందువల్లే మండల స్థాయిలో పరిష్కారం కావాల్సిన కేసులన్నీ జిల్లా కేంద్రంలో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు చేరుతున్నాయి. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు పట్టించుకోకుండా.. అవతలి వర్గంతో అధికారులు కుమ్మకై ్క నిజమైన యజమానులకు అన్యాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కొందరు అధికారులు వివిధ పనుల నిమిత్తం తమ వద్దకు వచ్చే మహిళలతో సన్నిహితంగా మెలుగుతూ వారి జీవితాలను అతలాకుతలం చేస్తున్నారు. దీంతో బాధితులు న్యాయం కోసం కలెక్టరేట్‌కు పరుగులు తీస్తున్నారు. అయితే కలెక్టరేట్‌లో అందే ఫిర్యాదులను ఆర్డీఓలకు పంపగా... వారు మళ్లీ తహసీల్దార్‌లకే పంపుతున్నారు. ఫలితంగా ఎలాంటి ఫలితమూ ఉండటం లేదు. మరోవైపు రాజకీయ అండదండలతో మండల స్థాయిలో తహసీల్దార్లు అక్కడే కొనసాగుతూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.
ఆ సబ్ డివిజన్‌లలోనే అధికంగా..
పుట్టపర్తి, పెనుకొండ సబ్ డివిజన్ల పరిధిలోని అధికారుల్లో చాలామందిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆయా సబ్ డివిజన్లలో భూముల విలువ భారీగా పెరగడంతో పాటు నిత్యం క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇదే అదనుగా భావించిన కొందరు..అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే తమ భూమిని తమపేరిట ఆన్‌లైన్‌లో ఎక్కించుకునేందుకు డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ ప్రజలు తిరగబడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల అధికారుల పని తీరు, వ్యవహార శైలిపై కలెక్టర్‌కు ఫిర్యాదులు భారీగా అందుతున్నాయి.
పెడపల్లిలో ‘భూ మాఫియా’
పుట్టపర్తి మండలం పెడపల్లిలో భూ మాఫియాకు తెరలేపినట్లు తెలుస్తోంది. టీడీపీకి చెందిన ఒకరిద్దరు ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. దీనిపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఆర్డీఓ స్థాయి నుంచి ఆదేశాలు అందినా.. మండల కార్యాలయంలో ఆగిపోతున్నాయి. ఎవరు.. ఎవరికి సపోర్టు ఇస్తున్నారన్న విషయం చర్చనీయంగా మారింది. టీడీపీ నాయకుల చేతుల్లోని ప్రభుత్వ భూములను ఎందుకు కాపాడుకోలేకపోతున్నారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మారుతిపై లెక్కలేనన్ని ఫిర్యాదులు..
గోరంట్ల తహసీల్దార్‌గా ఉన్న సమయంలో మారుతిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. భూముల భాగపరిష్కారం కోరగా.. తనకు రెండు ఎకరాలు రాసిస్తేనే పని చేస్తానని డిమాండ్ చేసినట్లు బాధితులు అప్పట్లోనే కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆయన్ను గోరంట్ల నుంచి సోమందేపల్లికి బదిలీ చేశారు. ప్రస్తుతం చిక్కబళ్లాపురకు చెందిన ఓ మహిళతో సన్నిహితంగా ఉంటూ ఆమె కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి.
రెవెన్యూశాఖలో లంచావతారాలు
ప్రజలను పట్టిపీడిస్తున్న అధికారులు
రాజకీయ అండదండలతో అరాచకం
పుట్టపర్తి, పెనుకొండ సబ్ డివిజన్ల పరిధిలోనే అధికం
కలెక్టరేట్‌కు తరలి వస్తున్న బాధితులు
ఆర్డీఓ ఆదేశించినా..
పట్టించుకోని తహసీల్దార్లు


