నల్లచెరువు: సరదాగా ఈతకు వెళ్లిన తండ్రి, ఎనిమిదేళ్ల కుమారుడు కాలువలో మునిగిపోయిన ఘటన నల్లచెరువు మండలం బందార్లపల్లిలో విషాదం నింపింది. వివరాలు.. బందార్లపల్లికి చెందిన రాము (40) కూలి పనులు చేసుకుంటూ భార్య, ఇద్దరు కుమారులను పోషించుకుంటున్నాడు. తన చిన్న కుమారుడు చిన్నోడు (8)తో కలిసి ఆదివారం బందార్లపల్లిలో హెయిర్ కటింగ్ చేయించుకున్న రాము అనంతరం గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న హంద్రీ–నీవా కాలువ వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు. నీటి ప్రవాహ ఉధృతి గుర్తించక కాలువలో దిగిన ఇద్దరూ కొట్టుకుపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రాము మృతదేహం లభ్యమైంది. చిన్నోడి ఆచూకీ లభించలేదు.
గ్రామంలో విషాద ఛాయలు..
ఘటనతో బందార్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాము మృతదేహం వద్ద కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. అప్పటిదాకా తమతో మాట్లాడిన రాము విగతజీవిగా పడి ఉండడం చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. ‘గతంలోనే నా ఇద్దరు కుమారులు అనారోగ్యంతో మరణించారు.. ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కుమారుడిని కూడా తీసుకెళ్లావా దేవుడా’ అంటూ రాము తల్లి రమణమ్మ రోదించిన తీరు అందరినీ కలచివేసింది.
ప్రభుత్వం ఆదుకోవాలి..
బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి కోరారు. ఘటన గురించి తెలుసుకున్న ఆయన గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. చిన్నోడు ఆచూకీని వీలైనంత త్వరగా కనుగొనాలని అధికారులకు విష్ణువర్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
హంద్రీ–నీవా కాలువలో
కొట్టుకుపోయిన తండ్రి,కుమారుడు
తండ్రి మృతదేహం లభ్యం..
కుమారుడి ఆచూకీ గల్లంతు
నల్లచెరువు మండలం
బందార్లపల్లిలో విషాదం


