అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు | - | Sakshi
Sakshi News home page

అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు

Mar 30 2026 7:29 AM | Updated on Mar 30 2026 7:29 AM

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ మండిపాటు

పెనుకొండ రూరల్‌: రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్‌ విమర్శించారు. ఆదివారం పెనుకొండ పట్టణంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమరావతిపై చంద్రబాబు ప్రభుత్వం అత్యవసరంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బిల్లు ప్రవేశ పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని అమరావతికి వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. తాకట్టు పెట్టేందుకే ఈ ప్రభుత్వం రెండో విడత భూ సేకరణ చేపడుతోందని ఆరోపించారు. గతంలో 30 వేల ఎకరాల పైబడి చేసిన భూ సేకరణలో ఎంత అభివృద్ధి చేశారు.. భూములిచ్చిన రైతులకు ఎలాంటి న్యాయం చేశారు.. బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి తీసుకొచ్చిన డబ్బును ఎందుకు ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజలను మభ్య పెట్టి సోపు టాపు చేసేందుకు రెండో విడత భూ సేకరణకు తెరలేపారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో కేవలం రూ. 2.35 లక్షల కోట్లు అప్పు చేస్తే.. రెండేళ్ల కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ. 3.40 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఒక్క పథకం కూడా ప్రజలకు పరిపూర్ణంగా అందకున్నా అప్పులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. చేసిన అప్పుల్లో రూ. 3 వేల కోట్లు ఆరోగ్యశ్రీ పథకానికి కేటాయించినా ప్రజలకు అరోగ్య సేవలు మెరుగ్గా అందేవన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో ఆరోగ్య శ్రీ అనారోగ్యశ్రీగా మారిందన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎక్కడా సంక్షేమ పథకాలు ఆగలేదని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా పారదర్శకంగా పథకాలు అందించామన్నారు. అప్పట్లో సంక్షేమంతో పాటు అభివృద్ధి పరుగులు పెట్టిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి లేదు..సంక్షేమమూ లేదని విమర్శించారు. కార్యక్రమంలో సోమందేపల్లి జెడ్పీటీసీ సభ్యుడు అశోక్‌, పెనుకొండ వైఎస్సార్‌ సీపీ పట్టణ, మండల కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్‌ రెడ్డి, సర్పంచులు అంజినాయక్‌, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.

నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక

ప్రశాంతినిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్‌ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్‌ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement