పుట్టపర్తి టౌన్: క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పనవి ఎస్పీ సతీష్‌కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైన నేపథ్యంలో యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బెట్టింగ్ మాయలో పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవద్దని హితవు పలికారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలన్నారు. బెట్టింగ్ అనేది వినోదం కాదని, అది ఒక వ్యసనమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. క్రికెట్‌ను కొందరు జూద క్రీడగా మార్చి అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారని, అలాంటి వారి ఉచ్చులో పడొద్దని యవతకు సూచించారు. జిల్లాలో ఎక్కడైనా బెట్టింగ్‌లు నిర్వహించినా, ప్రోత్సహించినా చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఎవరైనా బెట్టింగ్ నిర్వహిస్తుంటే 100, 112 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని, లేకుంటే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.


