ధర్మవరం: సీఎం చంద్రబాబు ధనదాహానికి అమరావతి రైతులు బలవుతున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం స్థానిక ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు అండ్ కో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రాజధాని అమరావతి వేదికైందన్నారు. రియల్‌ఎస్టేట్ వ్యాపారులకేమో మంచి ప్లాట్లు చూపిస్తారని, అదే వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు మాత్రం కంప్యూటర్‌లో తప్ప ఫీల్డ్‌లో ప్లాట్లు చూపించకుండా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధానిగా అమరావతికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం కాదని, గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం అమరావతిని శాసన రాజధానిగా ఏర్పాటు చేసి అభివృద్ధిని వికేంద్రీకరించే విధంగా చర్యలు చేపట్టారని, అయితే, చంద్రబాబు ఈ విషయంపై దుష్ప్రచారం చేశారన్నారు. పదేళ్ల క్రితం రాజధాని రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా 33 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించినా ఒక్కటంటే ఒక్కటి కూడా శాశ్వత నిర్మాణం చేపట్టకుండా తాత్కాలిక నిర్మాణాల పేరిట అస్మదీయ కాంట్రాక్టర్ల కంపెనీలకు దోచి పెట్టడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అది చాలదన్నట్లు మళ్లీ 20 వేల ఎకరాల భూసేకరణకు సిద్ధమవ్వడం చూస్తే చంద్రబాబు ధనదాహం ఎంతలా ఉందో అర్థమవుతోందన్నారు. ఎక్కడైనా కిలోమీటర్ రింగ్‌రోడ్డు రూ.22 కోట్లతో నిర్మిస్తారని మన రాజధానిలో మాత్రం రూ.175 కోట్లతో నిర్మిస్తున్నారంటే ఎన్ని కోట్ల అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
రైతుల ఆవేదన పట్టదా..?
రాజధానిలో పదేళ్లుగా భూములిచ్చిన రైతులు నిత్యం సీఆర్‌డీఏ ఆఫీస్‌కు వెళ్లడం, తమ ప్లాట్లు ఎక్కడున్నాయో అడగడం, ఆవేదనతో ఇంటికి వెళ్లడం పరిపాటిగా మారిందని కేతిరెడ్డి అన్నారు. కొంత మందికి మోకాల్లోతు నీళ్లు, వంకలు ఉన్న ప్రాంతంలో ప్లాట్లు ఇవ్వడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. ఇటీవల రాజధానిలో మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని పెట్టిన మీటింగ్ ద్వారా సమస్యకు పరిష్కారం దొరకక పోవడంతో ఆవేదనతో రైతు గుండె ఆగినా ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు. పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు డబ్బు అవసరమొస్తే భూమి అమ్మే వీలు లేకుండా పోయిందన్నారు.
జగన్ అంటే భయం మొదలైంది
చంద్రబాబు ప్రభుత్వానికి మళ్లీ జగన్ వస్తాడనే భయం మొదలైందని కేతిరెడ్డి పేర్కొన్నారు. మళ్లీ జగన్ వస్తే తమ అవినీతి బండారం బట్టబయలవుతుందనే భయంతోనే శాసనసభలో సమావేశాలు పెట్టి మరీ చర్చించుకుంటున్నారన్నారు. జగనన్నను తిట్టేందుకే గంటల పాటు శాసనసభలో గడపడం చూస్తే వారిలో ఎంత కలవరం మొదలైందో అర్థమవుతోందన్నారు. రాజధానికి అడ్డుపడితే కాల్చివేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారని, మరో మంత్రి సత్యకుమార్ నల్లమల కాలిపోతోందని ప్రేలాపనలు చేస్తున్నారని, మీ నిర్వాకంతో రాష్ట్రం కాలిపోతోందని గతంలో చంద్రబాబుపై సత్యకుమార్ చేసిన విమర్శలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. పూటకోమాట మాట్లాడే నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి, రైతులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని, అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకూ వికేంద్రీకరణ జరగాలన్నదే తమ స్టాండ్ అని స్పష్టం చేశారు.
రాజధాని ముసుగులో
విచ్చలవిడిగా అవినీతి
అమాయక రైతులనూ బలి చేస్తున్నారు
జగన్ అంటే ‘కూటమి’ నేతల్లో
భయం మొదలైంది
మాజీ ఎమ్మెల్యే
కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి


