పీ4 వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పీ4 వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

Mar 30 2026 7:30 AM | Updated on Mar 30 2026 7:30 AM

ప్రశాంతినిలయం: పీ4 కార్యక్రమం ఏడాది పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం అన్ని నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పీ4 కార్యక్రమంలో మార్గదర్శులను, బంగారు కుటుంబాలను భాగస్వాములను చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ విజయ్‌కుమార్‌, ఆర్డీఓలు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.

మద్యం మత్తు .. హైవేపై నిద్ర

పెనుకొండ రూరల్‌: మద్యం మత్తులో ఓ యువకుడు రోడ్డుపై నిద్రించిన ఘటన పెనుకొండ 44వ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. పెనుకొండ వైపు నుంచి అనంతపురం వైపు ద్విచక్ర వాహనంలో వెళ్తున్న యువకుడు, ఫూటుగా మద్యం సేవించాడు. అయితే మార్గ మధ్యలో హరిపురం సమీపంలోకి రాగానే తన ద్విచక్ర వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా ఆపి నిద్రపోయాడు. గమనించిన స్థానికులు మందు బాబుని, ద్విచక్ర వాహనాన్ని పక్కకు జరిపారు. స్థానికులు అతన్ని నిద్ర లేపి వివరాలు సేకరించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. పోలీసులు వస్తున్నారని చెప్పడంతో అతను అనంతపురం వైపు వెళ్లిపోయాడు.

వేమన ఉత్సవాలకు

అంకురార్పణ

గాండ్లపెంట: మండల పరిధిలోని కటారుపల్లిలో ఆదివారం కుంభాభిషేకంతో యోగి వేమన ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ప్రతి ఇంటి నుంచి మహిళలు జొన్నలను ఆలయానికి తీసుకువచ్చి కుప్పగా పోశారు. ఈ జోన్నలను ఆలయ పీఠాధిపతులు ఆలయం ఎదుట రాసిగా పోసి పసుపు, కుంకుమ కలిపి మహాశక్తి పూజ చేసిన అనంతరం గ్రామస్తులకు పంచి పెట్టారు. ఈ ప్రసాదం కొన్ని రకాల వ్యాధులకు మందుగా కూడా వినియోగిస్తారు.

వేమన సమాధి వద్ద పూజలు

ఉత్సవాలను పురస్కరించుకుని వేమన సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. బెంగళూరుకు చెందిన కళాకారుల నాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోమవారం వేమన ఉత్సవాల్లో భాగంగా బండ్లమెరవణి, పానక పందార్యము నిర్వహిస్తారు. రాత్రి 9 గంటల నుంచి పాటల కచేరి ఏర్పాటు చేసినట్లు ఆలయ పీఠాధిపతి నంద వేమారెడ్డి తెలిపారు. డీఎస్పీ శివనారాయణస్వామి, కదిరి రూరల్‌ సీఐ నాగేంద్ర, ఎస్‌ఐ సుమతి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement