లేపాక్షి: మండల కేంద్రమైన లేపాక్షిలో సామాన్య రైతు పేరుతో ఓ పెద్ద భూస్వామి వందలాది ట్రాక్టర్ల మట్టిని తన పొలాలకు తరలిస్తుండగా సీపీఐ నాయకులు అడ్డుకున్నారు. సుమారు 70 ఎకరాల్లో ముగ్గురు రైతుల పేరుతో వందలాది ట్రాక్టర్ల మట్టిని మామిడిమాకులపల్లి కుంట నుంచి పొలాలకు తరలిస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక సీపీఐ నాయకులు కంచిసముద్రం రోడ్డుపై ట్రాక్టర్లకు అడ్డంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శివప్ప మాట్లాడుతూ 90 క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించుకోవడానికి అనుమతులు ఇస్తే నాలుగు జేసీబీల ద్వారా 25 ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారని, అదే చిన్న, సన్నకారు రైతులు మట్టి తరలించుకోవడానికి అధికారుల వద్దకు అనుమతి కోసం వెళితే తిరకాసు పెట్టి తిప్పకుంటున్నారని విమర్శించారు. రెండు రోజులుగా మట్టి రవాణా చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అక్రమ మట్టి రవాణాను వెంటనే నిలిపి వేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దీంతో అధికారులు అప్రమత్తమై మట్టి రవాణాను తాత్కాలికంగా ఆపేశారు.
ట్రాక్టర్ల ముందు సీపీఐ నాయకుల నిరసన


