ఆర్డర్ ఇస్తే .. కొట్టుకొచ్చేస్తారు !
ధర్మవరం అర్బన్: ఎవరైనా కొత్త బైక్‌పై మోజు పడితే షోరూంలలో కొనుగోలు చేస్తారు. అయితే కోరుకున్న బైక్‌ను క్షణాల్లో అపహరించి తెచ్చిచ్చి సొమ్ము చేసుకునే ఘటన ధర్మవరంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా... వివరాలను ధర్మవరం రెండో పట్టణ పీఎస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రెడ్డప్పతో కలసి డీఎస్పీ హేమంత్ కుమార్ వెల్లడించారు. ధర్మవరానికి చెందిన అనంత బాబు, ఇదే పట్టణంలోని ఇందిరానగర్ నివాసి సాకే మల్లికార్జున, ముదిగుబ్బ ఓల్డ్‌టౌన్‌లో నివాసముంటున్న మద్దినేని నాగరాజు ఓ ముఠాగా ఏర్పడి తక్కువ ధరకే తమ వద్ద ద్విచక్ర వాహనాలు ఉన్నాయని గ్రామీణులకు నమ్మబలికేవారు. ఏ కంపెనీ బైక్ కావాలన్నా.. ఏ మోడల్‌దైనా ముందుగా ఆర్డర్ తీసుకుని ఆ బైకును అపహరించి తక్కువ ధరకే విక్రయించేవారు. ధర్మవరం పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు, హిందూపురం, అనంతపురం, తాడిమర్రి పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇటీవల ద్విచక్ర వాహనాల అపహరణలపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. టూ టౌన్ సీఐ రెడ్డప్ప నేతృత్వంలోని ప్రత్యేక బృందంతో శుక్రవారం ధర్మవరంలోని మార్కెట్‌యార్డు సమీపంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న సాకే మల్లికార్జున, మద్దినేని నాగరాజును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో ద్విచక్ర వాహనాల అపహరణలు వెలుగు చూశాయి. ప్రధాన నిందితుడు అనంతబాబు పరారీలో ఉన్నాడు. వారి నుంచి 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.
ఇద్దరు బైకు దొంగల అరెస్ట్
12 ద్విచక్ర వాహనాల స్వాధీనం
పరారీలో ప్రధాన నిందితుడు


