నేరాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత
కదిరి టౌన్: మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు పోలీసులతో పాటు ఒక్కరి బాధ్యతని ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం కదిరి పట్టణంలోని దత్త ఫంక్షన్‌హాల్ కదిరి పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ‘మీ భధ్రత – మా బాధ్యత ’ మహిళా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ సతీష్‌కుమార్‌తో పాటు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ ఆడపిల్లలు బయటికి వెళ్లినప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలన్నారు. ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి వారితో కలిసి ఎక్కడికి వెళ్లకూడదన్నారు. ఐదారేళ్ల బాలికలకు చాకెట్లు ఇచ్చి వారిపై లైంగిక దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లినప్పుడు ఆడ పిల్లలను అంగన్వాడీ సెంటర్లలో వదిలి వెళ్లాలని, అప్పుడే వారికి రక్షణ ఉంటుందన్నారు. ప్రమాదం పొంచి ఉన్న సమయంలో బాలికలు, మహిళలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అంతకు ముందు పట్టణంలో విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్డీఓ వీవీఎస్ శర్మ, డీఎస్పీ శివనారాయణస్వామి, మహిళా డీఎస్పీ ఇందిరి తదితరులు పాల్గొన్నారు.


