కలెక్టరేట్‌లో ఘనంగా సెమీ క్రిస్మస్
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో సెమీ క్రిస్మస్ వేడుకను బుధవారం ఘనంగా నిర్వహించారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ , స్థానిక ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రామసుబ్బారెడ్డి, వివిద కార్పొరేషన్‌ల చైర్మన్‌లు, పలువురు పాస్టర్‌లు పాల్గొన్నారు.
బీచ్ గేమ్స్‌కు
19న క్రీడాకారుల ఎంపిక
పుట్టపర్తి టౌన్: పశ్చిమ భారత దేశంలోని కేంద్ర పాలిత దీవులైన డబ్యూ, డామన్, దాద్రా, నాగర్ హవేలీలో జనవరి 5 నుంచి 10వ తేదీ వరకూ జరిగే ఖేలో ఇండియా బీచ్ గేమ్స్‌కు ఏపీ తరఫున ప్రాతినిథ్యం వహించే క్రీడాకారుల ఎంపిక ఈ 19న చేపట్టనున్నారు. ఈ మేరకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి కిషోర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ, బీచ్ సెపక్ తక్రా క్రీడల్లో ఒపెన్ ఏజ్ విభాగంలో పురుషులు, మహిళల జట్లను ఎంపిక చేయనున్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ ఆధార్ కార్డ్, రెండు ఫొటోలు, జనన ధ్రువీకరణ పత్రంతో ఈ నెల 19న ఉదయం 9 గంటలకు విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రి వద్ద కృష్ణానది దక్షిణం వైపు ప్రాంతానికి చేరుకోవాలి. పూర్తి వివరాలకు 98661 34016, 90524 64770లో సంప్రదించవచ్చు.
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం
●అఘాయిత్యానికి ఒడిగట్టిన బాలుడు
పుట్టపర్తి టౌన్: కొత్తచెరువు మండలంలోని ఓ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై 17 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి ఈ నెల 14న తన ఇంటి పరిసరాల్లో ఆడుకుంటుండగా.. వారి ఇంటి ఎదురుగా ఉన్న 17 ఏళ్ల బాలుడు చాకెట్లు ఇస్తానంటూ ఇంట్లోకి పిలుచుకెళ్లి తలుపులు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న చిన్నారిని గమనించిన తల్లిదండ్రులు కొత్తచెరువు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్పీ సతీష్‌కుమార్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ విచారణకు డీఎస్పీ విజయ్‌కుమార్‌ను ఆదేశించారు. దీంతో విజయ్‌కుమార్ ఆ గ్రామానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బాలుడిపై కేసు నమోదు చేసి, వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని అనంతపురంలోని జీజీహెచ్‌కు తరలించారు.
పల్స్‌పోలియోను విజయవంతం చేయండి
ధర్మవరం అర్బన్: ఈ నెల 21న తలపెట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్య, ఆరోగ్య సిబ్బందిని డీఎంహెచ్‌ఓ డాక్డర్ ఫైరోజాబేగం ఆదేశించారు. బుధవారం ధర్మవరంలోని కొత్తపేట అర్బన్ హెల్త్ సెంటర్‌ను ఆమె తనిఖీ చేశారు. అనంతరం బీసీ హాస్టల్‌ను పరిశీలించారు. హాస్టల్‌లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, శానిటేషన్ మెరుగు పరచాలని అక్కడి సిబ్బందికి సూచించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ తిప్పేంద్రనాయక్‌తో కలసి స్క్రబ్ టైఫస్ వ్యాధిపై సమీక్షించారు. ప్రజలకు స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి చెన్నారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
పొట్టేళ్ల దొంగ అరెస్ట్
తలుపుల: స్థానిక కుమ్మరపేటలో నివాసముంటున్న గంగయ్యకు చెందిన 19 పొట్టేళ్లను ఈ ఏడాది నవంబర్ 28న దుండగులు అపహరించుకెళ్లిన విషయం తెలిసిందే. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం కదిరి – పులివెందుల మార్గంలో బట్రేపల్లి వద్ద బుధవారం ఉదయం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో పోలీసులను గమనించి సుమోలో పొట్టేళ్లను తరలిస్తున్న వారు వాహనాన్ని ఆపి ఐదుగురు పారిపోయారు. ఆ సమయంలో వాహనంలో ఉన్న రాప్తాడు పంచాయతీ పరిధిలోని చిన్మయనగర్‌కు చెందిన ఎరికల నాగభూషణ కుమారుడు చిన్నా పట్టుబడ్డాడు. 19 గొర్రెలను స్వాధీనం చేసుకుని విచారణ అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ నరసింహుడు తెలిపారు.
కలెక్టరేట్‌లో ఘనంగా సెమీ క్రిస్మస్


