‘సూపర్’లో వృద్ధురాలి మృతి
అనంతపురం మెడికల్: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఓ వృద్ధురాలి మృతి వివాదాస్పదమైంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే వృద్ధురాలు మృతి చెందిందంటూ కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాలు.. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న బత్తలపల్లి మండలం యర్రాయపల్లికి చెందిన కృష్ణమ్మ (85)ను కుటుంబసభ్యులు ఈ నెల 10న సూపర్ స్పెషాలిటీలో చేర్చారు. వైద్య పరీక్షల అనంతరం ఈ నెల 11న ఆమెకు తాత్కాలిక పేస్ మేకర్ చేశారు. అనంతరం వేయాల్సిన సింగిల్ చాంబర్ పేస్ మేకర్ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్‌గా సేకరించి ఈ నెల 16న శాశ్వత పేస్‌మేకర్‌ను వేశారు. బుధవారం సబ్‌క్లీవియన్ వీన్‌కు ఉన్న పైప్‌ను తొలగించిన కాసేపటికి వృద్ధురాలు కృష్ణమ్మ దగ్గుతో ఇబ్బంది పడుతూ అపస్మాకర స్థితికి చేరుకుంది. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. దీంతో మృతురాలి కుటుంబీకులు ఆగ్రహానికి లోనయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కృష్ణమ్మ మృతి చెందిందంటూ ఆందోళనకు దిగారు. సింగిల్ పేస్ మేకర్ కోసం రూ.65వేలు చెల్లించేవరకూ ఆపరేషన్‌ను చేయలేదని ఆరోపించారు. ఈ ఆరోపణలను దీనిపై కార్డియాలజిస్టు డాక్టర్ సుభాష్ చంద్రబోస్ ఖండించారు. పేదలు ఇబ్బంది పడకూడదని, తమ వద్ద ఉన్న డ్యూయల్ చాంబర్ పేస్ మేకర్‌ను వేరే కంపెనీ వారికి ఇచ్చి సింగిల్ పేస్ మేకర్ తీసుకున్నామన్నారు. నయాపైసా తీసుకోకుండా ఉచితంగా పేస్ మేకర్ వేశామని, ఇందుకు కృతజ్ఞతభావం లేకున్నా పర్వాలేదని, అసత్య ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం సరికాదన్నారు.
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకుల ఆందోళన


