మా భూముల్లోకి వస్తే జాగ్రత్త!
పుట్టపర్తి అర్బన్: ‘‘ఇది జలవనరుల శాఖ స్థలం..ఇందులో ఎలాంటి కట్టడాలు, ఆక్రమణలు చేయరాదు. ఎవరైనా ఈ హెచ్చరికను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’’ అంటూ పుట్టపర్తిలో కనిపిస్తున్న బ్యానర్లు తీవ్ర చర్చకు దారి తీశాయి.
అభివృద్ధి పనుల పేరుతో ఆక్రమణ!
సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల సమయంలో పుట్టపర్తిలోని అత్యంత విలువైన భూములపై కొందరు కన్నేశారు. ఈ క్రమంలోనే జలవనరులశాఖకు చెందిన మూడు స్థలాలపై కన్నేశారు. వాటిని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ భూ ఆక్రమణ పర్వాన్ని వివరిస్తూ నవంబర్ 30వ తేదీన ‘జలవనరుల భూములకు ఎసరు’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన జలవనరులశాఖ అధికారులు ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. అక్కడి నుంచి అందిన ఆదేశాల మేరకు మంగళవారం తమ స్థలాల్లో హెచ్చరిక బ్యానర్లు ఏర్పాటు చేశారు.
మరో రెండు స్థలాల్లో ఆక్రమణ ఇలా..
● ఇరిగేషన్ కార్యాలయం సమీపంలోని ఎనుములపల్లి చెరువు వద్ద సర్వే నంబర్ 110లో 30 సెంట్లు స్థలం ఖాళీగా ఉంది. ఈ స్థలంలో గుంత ఉండటంతో దీన్ని టీడీపీ నాయకులు మట్టి తోలి చదును చేశారు. ప్లాట్లుగా విభజించుకుని కట్టడాలు కట్టేందుకు సిద్ధమయ్యారు. ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో చదును చేసే పనులను నిలిపివేశారు.
● పుట్టపర్తి సమీపంలోని కర్ణాటక నాగేపల్లి చిత్రావతి బ్రిడ్జి వద్ద సర్వే నంబర్ 275లో అర ఎకరా స్థలం ఉంది. ఇందులో ఆరపు సంత పేరుతో నిర్మాణ పనులు చేపట్టారు. చుట్టూ ప్రహరీ నిర్మాణం, కంచె ఏర్పాటు చేశారు. జలవనరుల శాఖ అధికారులు నోటీసు బోర్డు ఏర్పాటు చేసినా నిర్మాణ పనులు ఆగలేదు. దీంతో మున్సిపల్ కమిషనర్‌తో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
కాంట్రాక్టర్లకు గుణపాఠం..
ఆర్టీసీ డిపో పక్కన జలవనరులశాఖ స్థలంలో పార్కు ఏర్పాటు చేయాలని టీడీపీ ముఖ్య నేత హడావుడి పెట్టడంతో ఓ కాంట్రాక్టర్ అంచనాలు, అనుమతులు లేకుండానే పనులు చేపట్టారు. ఇప్పుడు తమ భూమిలో జలవనరులశాఖ హెచ్చరిక బ్యానర్లు ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ పార్కు నిర్మాణానికి తాము అంచనాలే వేయలేదని, ఆ పనులతో తమకు సంబంధం లేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. మరి ఇప్పుడా కాంట్రాక్టర్ ఖర్చు చేసిన కాసులు పచ్చ నేత ఇస్తారా...లేక ముఖం చాటేస్తారా తెలియాల్సి ఉంది. ఈ ఘటన కాంట్రాక్టర్లకు గుణపాఠంగా మారింది. నేతలు చెప్పారని పనులు చేస్తే పరిస్థితి ఇంతేనంటూ వారంతా చర్చించుకుంటున్నారు.
ఇది ఆర్టీసీ డిపో పక్కనే ఉన్న సర్వే నంబర్ 127లోని అరఎకరా స్థలం. జలవనరుల శాఖకు సంబంధించిన ఈ స్థలంపై ఎప్పటి నుంచో కన్నేసిన టీడీపీ ముఖ్య నేత సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సమయంలో శుభ్రం చేసి పార్కింగ్ స్థలంగా వాడుకుంటామని ‘కథలు’ చెప్పారు. ఆ తర్వాత అనుమతులు లేకుండా పార్కు నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తికాకముందే ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కూడా పార్కును అట్టహాసంగా ప్రారంభించి గుర్తుగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఈ భూఆక్రమణ బాగోతం ‘సాక్షి’ వెలుగులోకి తేగా...జలవనరులశాఖ అధికారులు మేల్కొన్నారు. ఇప్పుడా స్థలంలో హెచ్చరిక బ్యానర్లు ఏర్పాటు చేశారు.
..ఇలా పుట్టపర్తి పట్టణంలోని మూడు ప్రాంతాల్లో రూ.కోట్ల విలువైన జలవనరుల శాఖ స్థలాలు ఆక్రమణకు గురికాగా, ‘సాక్షి’ కథనంలో మేల్కొన్న అధికారులు ఆయా స్థలాల్లో హెచ్చరిక బ్యానర్లు ఏర్పాటు చేశారు.
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన
జలవనరుల శాఖ
ఇప్పటికే ఆయా స్థలాల్లో
హడావుడిగా అభివృద్ధి పనులు
రూ.కోట్ల భూములకు ఎసరు పెట్టిన టీడీపీ ముఖ్య నేత
బాబా శత జయంత్యుత్సవాల
పేరుతో స్థలాల స్వాధీనం
‘సాక్షి’ కథనంతో మేల్కొన్న
అధికారులు.. పారని ‘పచ్చ’ పాచిక
మా భూముల్లోకి వస్తే జాగ్రత్త!
మా భూముల్లోకి వస్తే జాగ్రత్త!
మా భూముల్లోకి వస్తే జాగ్రత్త!


