ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్
● నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు
రొద్దం: పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ పడింది. మండల పరిధిలోని పెన్నా పరివాహక ప్రాంతం నుంచి కొందరు ఇసుకను తవ్వుకుని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా భూగర్భ జలమట్టం తగ్గి బోర్లలో నీరురాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఇసుక తవ్వకాలతో పెన్నాలో భారీ గోతులు పడటంతో నది రూపురేఖలు కోల్పోయింది. ఈ ఇసుక అక్రమ రవాణాపై ‘పెన్నా మొత్తం గోతులే’ శీర్షికన బుధవారం ‘సాక్షి’ కథనం ప్రచురించింది. స్పందించిన అధికారులు ఇసుక అక్రమ రవాణాపై చర్యలు ప్రారంభించారు. చెరుకూరు పెన్నానది నుంచి కర్ణాటకకు ఇసుక అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకుని కేసులు నమోదు చేశారు. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
● కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్
ప్రశాంతి నిలయం: జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తాడేపల్లిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. 2047 విజన్ ప్రణాళికల అమలుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాల మేరకు సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో లక్ష్యం మేరకు వంద శాతం ప్రగతి సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నవంబర్ 16 నుంచి 23వ తేదీ వరకు సత్యసాయిబాబా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని వెల్లడించారు.
కొనసాగుతున్న
టెట్ పరీక్షలు
● పుట్టపర్తిలోని కేంద్రాన్ని పరిశీలించిన డీఈఓ కిష్టప్ప
పుట్టపర్తి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. స్థానిక సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని బుధవారం డీఈఓ కిష్టప్ప పరిశీలించారు. పరీక్షలు జరుగుతున్న తీరుతెన్నెలను డిపార్ట్ మెంటల్ అధికారి వెంకటరమణను అడిగి తెలుసుకున్నారు. ఇతర ప్రాంతాల అభ్యర్థులను పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన కేంద్రానికి కేటాయించడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 100 మంది, సాయంత్ర 100 మందికి పరీక్షలు రాస్తున్నారని, ఇప్పటి వరకు సగటున 90 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారని డిపార్ట్ మెంటల్ అధికారి తెలిపారు.
రేపు అవగాహన సదస్సు
పుట్టపర్తి: ఇంటర్మీడియెట్ పరీక్షా విధానం, సిలబస్‌లో వచ్చిన మార్పులు, సంస్కరణలపై ఈ నెల 19వ తేదీన జగరాజుపల్లి వద్ద ఉన్న మంగళకర కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ జిల్లా విద్యాధికారి చెన్నకేశవ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సదస్సుకు ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణ ప్రత్యేకాధికారి రమేష్, రీజనల్ జాయింట్ డైరెక్టర్ సురేష్ బాబు హాజరవుతారని వెల్లడించారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు హాజరు కావాలన్నారు.
ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్
ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్
ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్


