తమిళనాడు, పుదుచ్చేరి శుభారంభం
అనంతపురం కార్పొరేషన్: భారత సీనియర్ పురుషుల సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నీ బుధవారం ఆర్డీటీ మైదానంలో అట్టహాసంగా ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులతో ఆర్డీటీ మైదానం కలకల లాండింది. బుధవారం గ్రూప్ జీలో భాగంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ జట్లు బరిలో దిగాయి. తొలిరోజు తమిళనాడు, పుదుచ్చేరి జట్లు శుభారంభం చేశాయి. తొలి మ్యాచ్‌లో తమిళనాడు, అండమాన్ జట్లు తలపడగా తమిళనాడు జట్టు క్రీడాకారులు ఆది నుంచి ఆధిపత్యం కొనసాగించారు. ఏ దశలోనూ ప్రత్యర్థి జట్టుకు అవకాశం ఇవ్వకుండా 6–0 గోల్స్ తేడాతో జట్టును గెలిపించారు. మధ్యాహ్నం జరిగిన మరో మ్యాచ్‌లో ఆంధ్ర, పుదుచ్చేరి జట్లు తలపడ్డాయి. ఆంధ్ర జట్టు గట్టి పోటీ ఇచ్చినా.. తొలి అర్ధభాగంలో పుదుచ్చేరి జట్టు గోల్ సాధించింది. అనంతరం రెండో అర్ధభాగంలో ఆంధ్ర జట్టు గోల్ చేయడంతో ఆట పోటాపోటీగా సాగింది. చివరి నిమిషంలో పుదుచ్చేరి జట్టు రెండు కీలక గోల్స్ సాధించి 3–1 గోల్స్ తేడాతో ఆంధ్రపై విజయం సాధించింది. పోటీలను ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం డేనియల్ ప్రదీప్ పర్యవేక్షించారు.
అట్టహాసంగా సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ప్రారంభం


