బాదనహాళ్ రైల్వేస్టేషన్ ప్రారంభం
రాయదుర్గం టౌన్: డి.హీరేహాళ్ మండలం బాదనహాళ్ వద్ద నూతనంగా నిర్మించిన రైల్వే క్రాసింగ్ స్టేషన్‌ను నైరుతీ రైల్వే గతిశక్తి విభాగం చీఫ్ ప్లానింగ్ మేనేజర్ సంజయ్‌కుమార్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ రమేష్ చంద్ర బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. నూతన ట్రాక్‌పై అజ్మీర్ నుంచి మైసూరు వారాంతపు ప్రత్యేక రైలు సర్వీసుకు పచ్చ జెండా ఊపి రాకపోకలు ప్రారంభించారు. రాయదుర్గం–బళ్లారి నడుమ గతంలో బాదనహాల్, సోమలాపురం, పులకుర్తి, ఓబుళాపురం వద్ద రైల్వే స్టేషన్‌లు ఉండేవి. బ్రాడ్‌గేజ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బాదనహాళ్, పులకుర్తి స్టేషన్లను తొలగించారు. దీంతో రాయదుర్గం నుంచి సోమలాపురం మధ్య సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి స్టేషన్ ఉండేది కాదు. ఈ మార్గంలో ఒకే రైలు మార్గం ఉండడం వల్ల ఎదురుగా మరో రైలు వస్తే అటు సోమలాపురంలో గానీ, ఇటు రాయదుర్గంలో గానీ రైలు ఆగాల్సి వచ్చేది. దీంతో రైల్వే అధికారులు గతంలో ఉన్న బాదనహాల్ వద్ద క్రాసింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి, లూప్ లైన్లను నిర్మించారు.


