యూరియా.. రబీలోనూ లేదయా
పుట్టపర్తి టౌన్: ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులు ఇవ్వకుండా వేధించిన చంద్రబాబు సర్కార్...రబీలోనూ తన పంథాను వీడటం లేదు. రబీ ప్రణాళికను వ్యవసాయాధికారులు మందుగానే పంపినా అవసరమైన ఎరువులు జిల్లాకు సరఫరా చేయలేదు. ఫలితంగా రైతులు రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. బుధవారం పుట్టపర్తి సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేపట్టారు. 280 బస్తాల యూరియా మాత్రమే నిల్వ ఉండటం.. రైతులు భారీగా తరలి వచ్చారు. దీంతో అధికారులు ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో వారంతా ఆందోళనకు దిగారు. ప్రస్తుతం తాము మొక్కజొన్న, జొన్న, వరి పంటలు సాగు చేస్తున్నామని... రెండు బస్తాల యూరియా ఇస్తే ఏ పంటకు వేయాలని అధికారులతో గొడవకు దిగారు. ప్రభుత్వం అరకొరగా పంపిణీ చేసిన యూరియాను కూడా అధికార పార్టీ మద్దతుదారులకే ఇస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు జిల్లా కేంద్రం పుట్టపర్తి నడిబొడ్డున యూరియా పంపిణీ జరుగుతుంటే అటు వ్యవసాయ అధికారులు గానీ, ఇటు సొసైటీ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో కిందిస్థాయి సిబ్బంది ఉన్న యూరియాను అరకొరగా పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు స్థానికంగానే కావాల్సినంత డీపీపీ, కాంప్లెక్స్ ఎరువులు అందేవని, ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు, విత్తనాలు కావాల్సినన్ని సరఫరా చేయాలని కోరారు.
రైతులకు తప్పని కష్టాలు


