రీసర్వేపై రివర్స్ గేర్!
జిల్లాలో
పుట్టపర్తి అర్బన్: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ‘జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష’ పథకంపై చంద్రబాబు రచ్చరచ్చ చేశారు. రీ సర్వే పేరుతో భూములను లాగేసుకుంటారని, భూమిపై హక్కులు పోతాయని అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టారు. కానీ అధికారంలోకి రాగానే అదే చంద్రబాబు... ‘ఏపీ రీ సర్వే ప్రాజెక్టు’ పేరుతో భూముల రీ సర్వేపై దృష్టి సారించారు. ఉన్నతాధికారులను సైతం పొలాలకు పంపి సిబ్బంది మెడపై కత్తి పెట్టి రీ సర్వే చేయిస్తున్నారు. ఇది చూసిన రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు యూటర్న్ మరోసారి రుజువైందంటున్నారు.
ఐదు విడతలు.. 166 గ్రామాలు..
జిల్లాలో 32 మండలాల పరిధిలో 461 రెవెన్యూ గ్రామాలుండగా.. సుమారు 8,924 చదరపు కిలోమీటర్ల భౌగోళిక ప్రాంతం ఉంది. దీన్ని సంపూర్ణంగా సర్వే చేసేందుకు వైఎస్ జగన్ సర్కార్ రీసర్వేకు శ్రీకారం చుట్టింది. ఆర్డీఓలు, తహసీల్దార్ల ద్వారా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించింది. 355 మంది విలేజ్ సర్వేయర్లతో ప్రక్రియ ప్రారంభించింది. అప్పట్లోనే మూడు విడతల్లో 136 గ్రామాల్లో సర్వే పూర్తి చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...గతంలో వద్దని గగ్గోలు పెట్టిన రీసర్వేను పునఃప్రారంభించారు. రెండు విడతల్లో 55 గ్రామాల్లో రీసర్వే చేట్టారు. ఇందులో 30 గ్రామాల్లో సర్వే పూర్తికాగా, మరో 25 గ్రామాల్లో సర్వే సా...గుతోంది. మొత్తంగా జిల్లాలో ఇప్పటివరకూ ఐదు విడతల్లో 166 గ్రామాల్లో రీసర్వే పూర్తయ్యింది.
సరిహద్దు రాళ్లు లేవు, మ్యుటేషన్లు రావు
వైఎస్ జగన్ హయాంలో భూముల రీ సర్వే పూర్తి కాగానే సరిహద్దు రాళ్లు పాతేవారు. యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వడం, డిజిటల్ రికార్డులు రూపొందించడంతో పాటు ఎలాంటి ఖర్చులు లేకుండా మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు ఇచ్చేవారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇవేమీ చేయకుండానే సర్వే పూర్తి చేస్తోంది. దీంతో రైతులు పెదవి విరుస్తున్నారు. ఈ మాత్రం దానికి సర్వే చేయడం ఎందుకని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు రీసర్వేనే తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏ ఉద్దేశంతో సర్వే చేయిస్తున్నారని రైతులు చర్చించుకుంటున్నారు. సరిహద్దురాళ్లు పాతకపోతే సర్వే చేసి ఏం ఉపయోగమని ప్రశ్నిస్తున్నారు.
నాడు వద్దని ఆందోళన...
నేడు చేయాల్సిందేనని హుకుం
భూముల రీసర్వేపై
చంద్రబాబు వింత వైఖరి
ఇప్పటికే జిల్లాలో ఐదు విడతల్లో
166 గ్రామాల్లో పూర్తి
ప్రస్తుతం 25 గ్రామాల్లో
కొనసాగుతున్న రీసర్వే
రీసర్వేపై రివర్స్ గేర్!


