ధర్మవరంలో వృద్ధురాలికి స్క్రబ్‌ టైఫస్‌ | - | Sakshi
Sakshi News home page

ధర్మవరంలో వృద్ధురాలికి స్క్రబ్‌ టైఫస్‌

Dec 12 2025 6:05 AM | Updated on Dec 12 2025 6:05 AM

ధర్మవ

ధర్మవరంలో వృద్ధురాలికి స్క్రబ్‌ టైఫస్‌

పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ..

ఆస్పత్రిలో చికిత్స

ధర్మవరం అర్బన్‌: రాష్ట్ర వ్యాప్తంగా కలవరపెడుతున్న స్క్రబ్‌ టైఫస్‌ కేసులు ధర్మవరానికి పాకాయి. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు ఈనెల 8వ తేదీన తీవ్ర జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆమె నడుము మీద నల్లమచ్చను గుర్తించారు. వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రికి పంపి ఐజీఎం ఎలిసా పరీక్ష చేయించారు. గురువారం వచ్చిన ఫలితాల్లో ఆమె పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ధర్మవరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తిప్పేంద్రనాయక్‌ తెలిపారు. చిగ్గర్‌ మైటు అనే పురుగు కుట్టడం వల్ల టైఫస్‌ జబ్బు వస్తుందని సూపరింటెండెంట్‌ తెలిపారు. ఈ పురుగు కుట్టడం వల్ల శరీరంపై నల్లని మచ్చ ఏర్పడటంతోపాటు తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడతారన్నారు. శరీరంపై నల్లనిమచ్చలు కనిపిస్తే... వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం వృద్ధురాలికి ధర్మవరం ఆస్పత్రిలోనే అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.

గంగమ్మ తల్లి సొత్తు

చోరీపై విచారణ

కదిరి అర్బన్‌: మండల పరిధిలోని యర్రదొడ్డి గంగమ్మ అమ్మవారి కానుకల చోరీ ఘటనపై దేవదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. గురువారం కర్నూలు నుంచి వచ్చిన దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ గురుప్రసాద్‌.. ఆలయ అర్చకులు, సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గంగమ్మ అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను ఆటోలో తీసుకువెళ్తున్న ఈఓను గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామన్నారు. రికార్డులు పరిశీలించడంతో పాటు ఆలయ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు కోసం ఈనెల 10వ తేదీనే ఆరుగురు సిబ్బందిని డిప్యుటేషన్‌పై యర్రదొడ్డి గంగమ్మ ఆలయానికి పంపామన్నారు. ఆలయ రికార్డుల పరిశీలన అనంతరం పోలీసుల వద్ద ఉన్న సమాచారం తెలుసుంటామని, అలాగే బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలను సేకరించి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులను పంపుతామన్నారు.

ఎన్‌ఎస్‌గేట్‌లో

భారీగా బందోబస్తు

చెన్నేకొత్తపల్లి: రామగిరి ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో గురువారం ఎస్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఇతర ప్రాంతాల వారు రామగిరి వైపునకు వెళ్లకుండా ఎన్‌ఎస్‌ గేట్‌లోనే అడ్డగించారు. రామగిరి వైపునకు వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపారు.

నేడు షీప్‌ సొసైటీ ఎన్నికలు

అనంతపురం అగ్రికల్చర్‌: గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాల (షీప్‌ సొసైటీస్‌) ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 29 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించడానికి పశు సంవర్థకశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి విడతగా ఈనెల 5వ తేదీన 55 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించగా వివిధ కారణాలతో 13 సొసైటీలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. రెండో విడతలో కూడా పలు సొసైటీలకు ఎన్నికలు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం తోపుదుర్తి, అమ్మవారిపేట, కాలువపల్లి, టి.కొత్తపల్లి, చెర్లోపల్లి, దోసులుడికి, గొల్లలదొడ్డి, శీబాయి, వైసీ పల్లి, మలయనూరు, గొల్లపల్లి, నడిమిదొడ్డి, జి కొట్టాల, సింగనగుట్టపల్లి, పెద్దపప్పూరు మండలం చెర్లోపల్లి, జి.కొత్తపల్లి, బొమ్మేపర్తి, అయ్యవారిపల్లి, పీసీ ప్యాపిలి, కాటికానికాలువ, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం మామిళ్లపల్లి, పర్వతదేవరపల్లి, కొడపగానిపల్లి, రామస్వామితండా, నసనకోట, పి.కొత్తపల్లి, ఆత్మకూరు సొసైటీలకు ఎన్నికలు జరగనున్నాయి.

ధర్మవరంలో  వృద్ధురాలికి స్క్రబ్‌ టైఫస్‌1
1/1

ధర్మవరంలో వృద్ధురాలికి స్క్రబ్‌ టైఫస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement