సైబర్ సెల్‌కు ‘నకిలీ’ కేసు
మడకశిర: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ బర్త్ సర్టిఫికెట్ల కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. అగళి మండలంలోని కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి ఏకంగా 3,981 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ కావడంపై జిల్లా నోడల్ ఆఫీసర్ కళాధర్ లోతుగా విచారణ జరిపి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించారు. దాని ఆధారంగా ప్రభుత్వం క్రిమినల్ కేసు నమోదు చేసి సూత్రధారులను గుర్తించాలని స్థానిక అధికారులను ఆదేశించింది.
లాగిన్ హ్యాక్ అయ్యిందా...
నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో తొలుత గ్రామ కార్యదర్శులను అనుమానించిన అధికారులు...వారి పాత్రపైనే ఎక్కువగా దృష్టి పెట్టి విచారణ చేశారు. ఇప్పటి వరకూ మొత్తంగా ఐదుగురు గ్రామ కార్యదర్శులు పనిచేయగా...వారందరికీ వేర్వేరుగా విచారించారు. అయితే వారందరకూ కూడా తాము పంచాయతీ లాగిన్ వాడలేదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీ లాగిన్ హ్యాక్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు ఈ వ్యవహారంపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఇక నుంచి ఈకేసు దర్యాప్తు మొత్తం సైబర్ క్రైం పోలీసులు కనుసన్నల్లోనే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కొలిక్కిరాని నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారం
పంచాయతీ లాగిన్ హ్యాక్ అయినట్లు భావిస్తున్న అధికారులు
సైబర్ పోలీసులకు దర్యాప్తు బాధ్యతలు


